టీమిండియాలో ప్రతీ ప్లేస్ కూ ఏ రేంజ్ లో కాంపిటేషన్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీనియర్లు, యువ క్రికెటర్ల మధ్య గట్టిపోటీ నడుస్తోంది. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ వంటి టోర్నీల్లో ఫామ్ ఆధారంగానే యువ క్రికెటర్లకు చోటు దక్కుతోంది. అయితే ఏదో ఒక అంశంలోనే నిలకడగా రాణించడం కంటే ఆల్ రౌండర్ గా అదరగొట్టే ప్లేయర్స్ కే సెలక్షన్ లో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా టీ ట్వంటీ ఫార్మాట్ లో ఆల్ రౌండర్లకు ఉండే ఇంపార్టెన్స్ అంతా ఇంతా కాదు. పైగా గౌతమ్ గంభీర్ కోచ్ గా వచ్చిన తర్వాత బ్యాటర్లను కూడా బౌలర్లుగా మార్చేస్తున్నాడు. దీనిని సీరియస్ గా తీసుకున్న యువ హిట్టర్ రింకూసింగ్ బంతితోనూ మ్యాజిక్ చేస్తున్నాడు. యూపీ టీ20 లీగ్ లో మీరట్ మెవెరిక్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రింకూ బ్యాట్ తో పాటు బంతితోనూ అదరగొట్టేస్తున్నాడు.
ఇటీవలే నోయిడా సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 64 రన్స్ చేయడంతో పాటుగా 2 కీలక వికెట్లు తీసుకున్నాడు. తాజాగా మరోసారి తన బౌలింగ్ సత్తా ఏంటో నిరూపిస్తూ.. ఒకే ఓవర్లో 3 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. విజయం దిశగా సాగుతున్న కాన్పూర్ టీమ్ ను తన బౌలింగ్ తో దెబ్బతీశాడు. 6వ ఓవర్లో బంతిని అందుకున్న రింకూ ముగ్గురిని ఔట్ చేసి తన జట్టును గెలిపించాడు. ఆ మధ్య లంకతో సిరీస్ లోనూ రింకూ సింగ్ బంతితో మ్యాజిక్ చేశాడు. ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు తీసి భారత్ ను గెలిపించాడు. రింకూ త్వరలోనే పూర్తిస్థాయి ఆల్ రౌండర్ గా మారడం ఖాయమని అభిమానులు చెబుతున్నారు.