Rinku Singh: టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్ సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. తనకే సాధ్యమైన షాట్లతో మ్యాచ్‌లను ముగిస్తున్నాడు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా ప్రశాంతంగా ఉంటూ.. పరుగులు రాబడుతున్న రింకూ సింగ్.. దిగ్గజ ప్లేయర్ మహేంద్ర సింగ ధోనీని తలపిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో ఐదు టీ20 సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సత్తా చాటిన రింకూ సింగ్.. భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన వైజాగ్ టీ20లో ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా సిక్స్ బాది చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
ఆదివారం జరిగిన రెండో టీ20ల్లోనూ విధ్వంసకర బ్యాటింగ్‌తో 9 బంతుల్లో 2 సిక్స్‌లతో పాటు 4 బౌండరీలు బాది 31 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. రింకూ సింగ్ అందించిన అదనపు స్కోర్‌తో టీమిండియా ఈ మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో గెలుపొందింది. రింకూ సింగ్ ఇన్నింగ్స్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. టీమిండియా తాత్కలిక సారథి సూర్యకుమార్ యాదవ్ సైతం.. రింకూ సింగ్.. ధోనీని తలపిస్తున్నాడని కితాబిచ్చాడు. మ్యాచ్ అనంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన రింకూ సింగ్.. తన సక్సెస్ సీక్రెట్ చెప్పాడు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఉంటూ పరుగుల రాబట్టడానికి గల కారణాన్ని వెల్లడించాడు. ‘5-6 స్థానాల్లో ఆడిన అనుభవం నాకు చాలా ఉంది. నేను ఈ స్థానాల్లోనే ఎక్కువగా బ్యాటింగ్ చేశాను. ఈ స్థానంలో వచ్చి పరుగులు చేయాలంటే ప్రశాంతంగా ఉండటం ఎంత ముఖ్యమో నాకు బాగా తెలుసు. డెత్ ఓవర్లలో బౌలర్లు వేసే బంతులు ఏ ప్రదేశాల్లో పడుతున్నాయో చూసి ఆడటాన్ని నేను ఇష్టపడుతాను.
అంతేకాకుండా బౌలర్ స్లోయర్ బాల్ వేస్తున్నాడా? లేక ఫాస్ట్ బాల్ సంధిస్తున్నాడా? అనేది పసిగట్టేందుకు ప్రయత్నిస్తాను. అందుకు తగ్గట్లు నా షాట్‌ను ఎంపిక చేసుకుంటాను. డ్రెస్సింగ్ రూమ్ చాలా బాగుంది. ప్రతీ ఒక్కరితో ఈ సమయాన్ని ఆస్వాదిస్తున్నాను. ప్రస్తుతం నా ఆట పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. జట్టులో నాది ఫినిషర్ పాత్ర. కొన్నిసార్లు నాకు 5-6 ఓవర్లు ఆడే అవకాశం దక్కుతుంది. మరికొన్నిసార్లు 2 ఓవర్లు మాత్రమే ఆడాల్సి వస్తుంది. ఎన్ని బంతులు ఆడినా.. జట్టుకు కావాల్సిన పరుగులు చేయడమే ఫినిషర్‌గా నా బాధ్యత. అందుకు తగ్గట్లే నేను నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాను. వీవీఎస్ లక్ష్మణ్ సర్ కూడా అలానే ప్రాక్టీస్ చేయమని చెప్పాడు. చివరి 5 ఓవర్లలో వస్తే బ్యాటింగ్ ఎలా చేస్తానో ప్రాక్టీస్ కూడా అలానే చేయమంటున్నాడు. ‘అని రింకూ సింగ్ చెప్పుకొచ్చాడు.