అనుకోని ప్రమాదం.. దాదాపు చావు అంచులవరకూ వెళ్ళాడు…ఇక మళ్ళీ లేచి నడుస్తాడో లేదోనని డౌట్… అసలు గ్రౌండ్ లోకి అడుగుపెడతాడా… పెట్టినా మునుపటిలా ఆడగలడా… ఇవీ యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పై రెండేళ్ళ క్రితం యాక్సిడెంట్ తర్వాత వచ్చిన అనుమానాలు…వీటన్నింటినీ అధిగమించి, కఠిన పరిస్థితులను దాటి పట్టుదలగా మళ్ళీ గ్రౌండ్ లోకి ఏడాదిన్నర తర్వాత అడుగుపెట్టాడు. పంత్ పునరాగమనం నిజంగా అద్భుతమే… యాక్సిడెంట్ లో తీవ్రగాయాలు పాలై కొన్ని నెలల పాటు బెడ్ కే పరిమితమైన ఈ యువ వికెట్ కీపర్ కొన్నాళ్ళు కర్రలతో నడిచాడు. పూర్తిగా కోలుకోవడంతోనే జట్టులో చోటు దక్కదు.. మళ్ళీ ఫిట్ నెస్ సాధించాల్సిందే…బెడ్ రెస్ట్ కారణంగా బరువు పెరిగిన పంత్ నేషనల్ క్రికెట్ అకాడమీలో మళ్ళీ ట్రైనింగ్ మొదలుపెట్టి ఫిట్ నెస్ పరీక్షలు నెగ్గాడు.
ఒక్కమాటలో చెప్పాలంటే ఆ యాక్సిడెంట్ తో కెరీర్ మళ్ళీ ప్రారంభించిన పరిస్థితి…అయితేనేం ఎదురైన క్లిష్టపరిస్థితులను సంకల్పంతో ఎదుర్కొని టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ లో రాణించి టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ఎంపికైన పంత్ అక్కడ కూడా సత్తా చాటాడు. తాజాగా బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కూ ఎంపికైన పంత్ దాదాపు 664 రోజుల తర్వాత రెడ్ బాల్ క్రికెట్ ఆడబోతున్నాడు. కెరీర్ ముగిసినట్టే అన్న పరిస్థితి నుంచి అన్ని ఫార్మాట్ లలోకి రీఎంట్రీ ఇచ్చిన పంత్ గొప్ప పోరాటయోధుడని అనడంలో ఎలాంటి డౌట్ లేదు.