Australia: ఆదితాళం ఆస్ట్రేలియాదే.. బజ్ బాల్ ఆటగాళ్లకు బద్దలు బాషింగాల్

ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఇంగ్లాండ్‌కు ఆస్ట్రేలియా షాకిచ్చింది. 280 పరుగుల లక్ష్యంతో ఐదో రోజు బరిలోకి దిగిన కంగారూలు.. ఆట ఆఖరుదాకా పోరాడి చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నారు.

  • Written By:
  • Publish Date - June 21, 2023 / 02:49 PM IST

ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 197 బంతుల్లో 65, నిలకడకు తోడు ఆఖర్లో సారథి పాట్ కమిన్స్ 73 బంతుల్లో 44 నాథన్ లియాన్ 28 బంతుల్లో16 నాటౌట్ ల పోరాటంతో మరో నాలుగు ఓవర్ల ఆట మిగిలుండగానే కంగారూలు చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నారు. విజయానికి 53 పరగుల దూరంలో ప్రధాన బ్యాటర్లందరూ నిష్క్రమించినా కమిన్స్, లియాన్‌లు ఓ చిన్నపాటి యుద్ధమే చేసి తమ జట్టుకు విజయాన్ని అందించారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంతో నిలిచింది. సహచర ఆటగాళ్లు నిష్క్రమిస్తున్నా అర్థ సెంచురీ సాధించిన ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేసేందుకు బెన్ స్టోక్స్ రంగంలోకి దిగాడు.

అతడు వేసిన 72వ ఓవర్లో ఆఖరి బంతికి ఖవాజా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికీ ఆసీస్ స్కోరు 209-7. విజయానికి మరో 71 పరుగులు కావాలి. ఆ తర్వాత అలెక్స్ కేరీ 50 బంతుల్లో 20 తో పాటు, పాట్ కమిన్స్ కూడా క్రీజులో ఉండటంతో ఆసీస్‌ విజయంపై ధీమాగానే ఉంది. కానీ కేరీని జో రూట్ తన స్పిన్ ఉచ్చులో బంధించాడు. 227 పరుగుల వద్ద ఆసీస్ 8వ వికెట్ కోల్పోయింది. అప్పుడు ఆసీస్ సారథి కమిన్స్.. తన అనుభవన్నంతా రంగరించి క్రీజులో నిలిచాడు. బెన్ స్టోక్స్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగిస్తున్నా నిలబడ్డాడు. రాబిన్సన్, బ్రాడ్, రూట్, స్టోక్స్.. బౌలర్లు మారినా కమిన్స్ మాత్రం క్రీజులో ఫెవికాల్ పోసినట్టుగా అతుక్కుపోయాడు.

అలా అని డ్రా కోసం ఆడలేదు. జో రూట్ వేసిన 83వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. నాథన్ లియాన్ ను మరో ఎండ్‌లో నిలబెట్టి ఆసీస్‌ను గెలుపు దిశగా నడిపించాడు. ఇద్దరూ ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడంతో లక్ష్యం కరుగుతూ పోయింది. ఒక్కో పరుగు కూడబెట్టుకుంటూ చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ సాగిన కమిన్స్ – లియాన్ పోరాటం కచ్చితంగా చాలాకాలం పాటు గుర్తుంటుంది. 8 వికెట్లు పడగొట్టిన ఇంగ్లాండ్ బౌలర్లు.. చివరి రెండు వికెట్ల కోసం తీవ్రంగా శ్రమించి చివరకి ఓటమిని అంగీకరించారు.