క్రికెట్ లో మంచి టీమ్ ఉన్నా కెప్టెన్ సరైనోడు అయితేనే విజయాలు వస్తాయి… తీవ్ర ఒత్తిడిలోనూ జట్టును సమర్థవంతంగా లీడ్ చేయడంలో కెప్టెన్ దే కీరోల్… ఈ విషయంలో భారత సారథి రోహిత్ శర్మ ఎప్పటినుంచో తనదైన ముద్ర వేస్తున్నాడు. తాజాగా తన కెప్టెన్సీ మార్క్ ఏంటో బంగ్లాదేశ్ తో కాన్పూర్ టెస్టులో చూపించాడు.
బంగ్లాదేశ్ ను త్వరగా ఆలౌట్ చేయడంలో రోహిత్ తీసుకున్న నిర్ణయాలు.. చేసిన మార్పులు ఫలించాయి. ముఖ్యంగా ఫీల్డ్ సెట్ లో అదరగొట్టాడు. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మోమినుల్ హక్ కు అద్భుతమైన ఫీల్డింగ్ ను సెట్ చేశాడు. మోమినుల్ పదే పదే స్వీప్ షాట్ కు ప్రయత్నిస్తుంటే రోహిత్ తన వ్యూహాలను మార్చాడు. అశ్విన్ బౌలింగ్ లో చుట్టూ ఫీల్డర్లను ఉంచాడు. అటాకింగ్ ఫీల్డ్ సెట్ తో ఒత్తిడిలో పడేశాడు.
స్లిప్, షార్ట్ కవర్, షార్ట్ లెగ్, లెగ్ స్లిప్ లో ఫీల్డర్లను ఉంచాడు. దీంతో మోమినుల్ హక్ తీవ్ర ఒత్తిడిలో లెగ్ స్లిప్ లో రాహుల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సాధారణంగా లెగ్ స్లిప్ లో ఫీల్డర్ ను ఉంచడం ఎప్పుడోకాని కనిపించదు. కానీ రోహిత్ ఈ ఫీల్డ్ సెటప్ తో ఫలితం వచ్చింది. అంతేకాదు బంగ్లాదేశ్ పార్టనర్ షిప్ బలపడుతున్న వేళ జడేజాను బౌలింగ్ కు దింపాడు. జడేజా చివరిరోజు తన తొలి ఓవర్ రెండో బంతికే శాంతోను ఔట్ చేశాడు. దీంతో రోహిత్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ రోహిత్ కెప్టెన్సీని ప్రశంసించాడు. ఫీల్డింగ్ సెటప్ ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటూ రోహిత్ గొప్పగా వ్యవహరించాడని కితాబిచ్చాడు.