Rohit Sharma: రోహిత్ శర్మ సక్సెస్ సీక్రెట్ అదే..!

తాజాగా అమోల్ కూడా రోహిత్‌ను ఆకాశానికెత్తేశాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను రోహిత్‌ను చాలాకాలంగా ఎంతో దగ్గరి నుంచి చూస్తున్నానని, రోహిత్ తనను తాను ఎలా మలచుకుంది, స్టార్‌గా ఎలా ఎదిగింది తాను దగ్గరగా చూశానన్నాడు.

  • Written By:
  • Publish Date - October 17, 2023 / 08:46 PM IST

Rohit Sharma: టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అయితే రోహిత్ సక్సెస్ వెనకున్న సీక్రెట్‌ని ముంబై మాజీ క్రికెటర్ అమోల్ ముజుందార్ బయటపెట్టాడు. రోహిత్‌ని తాను చాలాకాలంగా గమనిస్తున్నానని, ఒకవైపు ఆటగాడిగా, మరోవైపు కెప్టెన్‌గా రోహిత్ సూపర్ సక్సెస్ కావడానికి అతడు ఫాలో అయ్యే కొన్ని విధానాలే కారణమని అమోల్ చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత్ సూపర్ విక్టరీ సాధించిన తర్వాత రోహిత్ కెప్టెన్సీని మాజీలు, విశ్లేషకులు తెగ మెచ్చుకుంటున్నారు.

తాజాగా అమోల్ కూడా రోహిత్‌ను ఆకాశానికెత్తేశాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను రోహిత్‌ను చాలాకాలంగా ఎంతో దగ్గరి నుంచి చూస్తున్నానని, రోహిత్ తనను తాను ఎలా మలచుకుంది, స్టార్‌గా ఎలా ఎదిగింది తాను దగ్గరగా చూశానన్నాడు. “రోహిత్ శర్మ ప్రతి చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాడు. అతి చిన్న విషయాలను కూడా జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటాడు. ముఖ్యంగా మ్యాచ్ స్టాటిస్టిక్స్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్ళ ప్రతి కదలికను క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. దాంతో వాళ్ళ వీక్ పాయింట్ ఏంటి..? వాళ్ళని ఎలా దెబ్బ కొట్టాలి..? వాళ్లపై గెలవాలంటే ఏం చేయాలి..? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ స్పష్టంగా సమాధానాలు వెతుక్కోగలడు. అందుకే అతడు బెస్ట్ ప్లేయర్‌తో పాటు సూపర్ కెప్టెన్ కూడా కాగలిగాడు” అంటూ ముజుందార్ వివరించాడు. అంతేకాకుండా రోహిత్ ఏ విషయాన్నీ కాంప్లికేట్ చేసుకోడని, క్లిష్టమైన సమస్యలను కూడా సింపుల్‌గా పరిష్కరించడానికి ట్రై చేస్తాడని చెప్పిన ముజుందార్.. జట్టు సభ్యులు కూడా తనలాగే ఆలోచించేలా, వాళ్లపై ఒత్తిడి లేకుండా చేయడంలో రోహిత్ స్పెషలిస్ట్ అని, అదే అతడి సక్సెస్ సీక్రెట్ అని చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే వరల్డ్ కప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. మొదట ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా, ఆ తర్వాత ఆఫ్ఘన్‌ను అలవోకగా ఓడించింది. ఇక చివరగా పాకిస్తాన్‌ను మట్టికరిపించి అద్భుత విజయం దక్కించుకుంది. ఇక బ్యాటింగ్‌లో కూడా రోహిత్ అదరగొడుతున్నాడు. ఆఫ్ఘన్‌పై సెంచరీ, పాకిస్తాన్‌పై 85 పరుగులు బాది ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు.