Rohit Sharma: రోమరోమాలు ఉప్పొంగేలా.. రోహిత్ నిర్ణయం..

రాజ్‌కోట్ వేదికగా బుధవారం జరిగిన చివరి మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఇతర సీనియర్ ఆటగాళ్లు అందుబాటులోకి రాగా.. టీమిండియా 66 పరుగుల భారీ తేడాతో చిత్తయ్యింది.

  • Written By:
  • Updated On - September 28, 2023 / 02:16 PM IST

Rohit Sharma: వన్డే ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా గెలిచింది. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లకు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లంతా దూరంగా ఉండగా.. రాహుల్ సారథ్యంలోని భారత జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో కంగారులను చిత్తు చేసి సిరీస్ కైవసం చేసుకుంది.

రాజ్‌కోట్ వేదికగా బుధవారం జరిగిన చివరి మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఇతర సీనియర్ ఆటగాళ్లు అందుబాటులోకి రాగా.. టీమిండియా 66 పరుగుల భారీ తేడాతో చిత్తయ్యింది. టీమిండియా చేసిన ప్రయోగాలు బెడిసి కొట్టడంతో పాటు గ్లేన్ మ్యాక్స్‌వెల్ 4 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. చివరి మ్యాచ్ ఓడినా సిరీస్ భారత్‌దే కావడంతో ట్రోఫీ అందుకోవడానికి రోహిత్ శర్మ ఆహ్వానించగా అతను నిరాకరించాడు. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన కేఎల్ రాహుల్‌కు ట్రోఫీ అందజేయాలని నిర్వాహకులకు సూచించాడు. దాంతో వారు రాహుల్‌ను ఆహ్వానించి ట్రోఫీ అందజేయగా.. ఆ తర్వాత రోహిత్ ట్రోఫీతో ఫోజిచ్చాడు. అయితే ట్రోఫీని ముట్టుకోవడానికి కూడా రోహిత్ ఇష్టపడకపోవడం గమనార్హం. తాను గెలవని ట్రోఫీని అందుకోవడం సమంజసం కాదని రోహిత్ భావించి ఉంటాడు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘మామ ఈ కప్ నీది రా..!’అని రోహిత్ శర్మ.. రాహుల్‌తో అన్నాడని మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఇక ట్రోఫీని కేఎల్ రాహుల్.. సౌరాష్ట్రకు చెందిన లోకల్ ప్లేయర్లకు అందజేయడం మరింత చర్చనీయాంశమైంది. జట్టులోకి కొత్తగా వచ్చే ఆటగాళ్లకు ట్రోఫీని అందజేయడం సంప్రదాయం. అయితే రాజ్‌కోట్ వన్డేలో భారత్ జట్టుకు 13 మంది ఆటగాళ్లే అందుబాటులో ఉండటంతో.. టీమ్‌ మేనేజ్‌మెంట్ లోకల్ ప్లేయర్ల సాయం కోరింది. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్లుగా బ్యాకప్‌గా ఉపయోగించుకోవాలని భావించింది.

ఈ క్రమంలోనే సౌరాష్ట్ర లోకల్ ప్లేయర్లు చివరి వన్డేలో భాగమయ్యారు. దాంతోనే ట్రోఫీని వారికి అందజేశారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 352 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్84 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 96, డేవిడ్ వార్నర్34 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులతో విధ్వంసకర బ్యాటింగ్ చెలరేగగా.. స్టీవ్ స్మిత్61 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 74, మార్నస్ లబుషేన్58 బంతుల్లో 9 ఫోర్లతో 72 హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన టీమిండియా 49.4 ఓవర్లలో 286 పరుగులకు కుప్పకూలింది.