Andy Flower: ఆర్సీబీ కోచ్‌గా ఆండీ ఫ్లవర్.. కప్పు ఖాయమేనా..?

ఐపీఎల్ 2023లో హెడ్‌ కోచ్‌గా పని చేసిన సంజయ్‌ బంగర్‌ నుంచి జింబాబ్వే మాజీ కెప్టెన్ అండీ ఫ్లవర్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని ఆర్‌సీబీ తన అధికారిక ట్విట్టర్ వేదికగా శుక్రవారం తెలిపింది.

  • Written By:
  • Updated On - August 4, 2023 / 01:33 PM IST

Andy Flower: ఐపీఎల్ ప్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక నిర్ణయం తీసుకుంది. జింబాబ్వే మాజీ క్రికెటర్ అండీ ఫ్లవర్‌ను హెడ్‌ కోచ్‌గా నియమించుకుంది. ఈ విషయాన్ని ఆర్‌సీబీ తన అధికారిక ట్విట్టర్ వేదికగా శుక్రవారం తెలిపింది. దాంతో ఐపీఎల్ 2023లో హెడ్‌ కోచ్‌గా పని చేసిన సంజయ్‌ బంగర్‌ నుంచి జింబాబ్వే మాజీ కెప్టెన్ అండీ ఫ్లవర్‌ బాధ్యతలు స్వీకరించారు. ‘ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమర్‌, టీ20 ప్రపంచకప్‌ విన్నింగ్‌ కోచ్‌.. ఆండీ ఫ్లవర్‌కు స్వాగతం.

ఆండీ ఫ్లవర్‌ను ఆర్‌సీబీ మెన్స్ హెడ్‌ కోచ్‌గా నియమించాం. ప్రపంచవ్యాప్తంగా ఆండీ ఫ్లవర్‌కు ఉన్న అనుభవం ఆర్‌సీబీ జట్టును ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుందని భావిస్తున్నాం. ఆండీ ఈ బాధ్యతలు స్వీకరించినందుకు చాలా సంతోంషం’ అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఫ్లవర్‌కు దశాబ్దానికి పైగా కోచ్‌గా పని చేసిన అనుభవం ఉంది. 2010లో ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్‌ను గెలిచినపుడు ఆ జట్టుకు ఆండీ కోచ్‌గా ఉన్నారు. ఐపీఎల్‌ 2022, 2023 సీజన్లలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టుకు హెడ్‌ కోచ్‌గా అండీ పని చేశారు. మెంటార్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో కలిసి పని చేశారు. లక్నో మొదటి రెండు సీజన్‌లలో ప్లేఆఫ్‌లకు వెళ్లిన విషయం తెలిసిందే.

అయితే 2024 సీజన్‌కు ముందు అండీని లక్నో రిలీజ్ చేసి.. ఆస్ట్రేలియన్ గ్రేట్.. జస్టిన్ లాంగర్‌ను ప్రధాన కోచ్‌గా నియమించుకుంది. ప్పుడు ఆర్‌సీబీ అండీని కోచ్‌గా ఎంచుకుంది. ఐపీఎల్‌ 2023 ఆరంభంలో ఆకట్టుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చివరలో చేతులేత్తేసింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆరో స్ధానంతో సరిపెట్టుకుంది. 2024కు అండీ ఫ్లవర్‌ కోచ్‌గా ఎంపికవడంపై ఆర్‌సీబీ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2024లో కప్పు ఖాయం అని అంటున్నారు. ఎందుకంటే అండీ ఇప్పటివరకు పని చేసిన జట్లు ఛాంపియన్‌గా నిలిచాయి.