Varanasi Cricket Stadium: భారత్‌లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అందుబాటులోకి రానుంది. ఉత్తరప్రదేశ్‌లోని తన పార్లమెంట్ నియోజకవర్గం వారణాసిలో నూతన క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ స్టేడియం నిర్మాణం కోసం 31 ఎకరాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.121 కోట్లకు కొనుగోలు చేసింది.
బీసీసీఐ.. ఈ స్టేడియం నిర్మాణానికి రూ. 330 కోట్లు వెచ్చించనుంది. రింగ్‌రోడ్ సమీపంలోని రాజాతలాబ్ ప్రాంతంలో ఈ స్టేడియాన్ని ఏర్పాటు చేయనున్నారు. 2025 డిసెంబర్‌కల్లా ఈ స్టేడియం పూర్తవుతుంది. ఉత్తరప్రదేశ్‌లో ఇది మూడో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కానుంది. ఇప్పటికే కాన్పూర్, లక్నోలలో ఒక్కో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఉంది. శనివారం జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి భారత క్రికెట్ ప్రముఖులందరూ హాజరయ్యారు. సునీల్ గావస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీకి సచిన్ టెండూల్కర్ భారత జట్టు జెర్సీ అందజేశారు. సచిన్ బహుకరించిన జెర్సీపై నమో అని రాసి ఉంది. అదే విధంగా బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, జై షా భారత జట్టు క్రికెట్ సభ్యులు సంతకాలు చేసిన బ్యాట్‌ను ప్రధానికి ప్రదానం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.