Sachithra Senanayake: శ్రీలంక మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ సచిత్ర సేనానాయకే ప్రస్తుతం మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో కొలంబోలోని స్థానిక కోర్టు అతడు విదేశాలకు వెళ్లకుండా సోమవారం నిషేధం విధించింది. 38 ఏళ్ల సేనానాయకే లంక ప్రీమియర్ లీగ్ 2020 టోర్నీలో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించి ఇద్దరు ఆటగాళ్లను సేనానాయకే టెలిఫోన్‌లో సంప్రదించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
సచిత్ర సేనానాయకేపై మూడు నెలల పాటు ట్రావెల్ బ్యాన్ విధించాలని ఇమ్మిగ్రేషన్, ఎమిగ్రేషన్ కంట్రోలర్ జనరల్‌ను కొలంబో చీఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. సచిత్ర సేనానాయకే 2012 నుంచి 2016 మధ్య శ్రీలంక తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. లంక తరఫున అతడు 1 టెస్టు, 49 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. సేననాయకే బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కూడా జట్టుకు సహకారం అందించాడు. 2014 ఐసీసీ టీ20 ప్రపంచకప్ విజేత జట్టులో అతడు సభ్యుడు. అజంతా మెండిస్, సిక్కుగే ప్రసన్నతో పాటు సచిత్ర కీలక స్పిన్నర్‌గా ఉన్నాడు. ఇక ఐపీఎల్ 2013 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. ఎంఎస్ ధోనీ సారథ్యంలో చెన్నై తరఫున 8 మ్యాచ్‌లు ఆడి 9 వికెట్లు తీశాడు.