ఎన్నడూ లేని విధంగా కుర్రాళ్లను చూసి సీనియర్లు కూడా భయపడిపోతున్నారు. ఇక తాజాగా మరో యువ బ్యాటర్ టీమిండియా వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున సాయి సుదర్శన్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. సాయి సుదర్శన్, వన్ డౌన్ లో ఆడుతూ మంచి ప్రదర్శన చేశాడు. ఫైనల్లో 96 పరుగులతో వీరోచిత పోరాటం చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో 8 మ్యాచ్ ల్లో 362 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక తాజాగా ముగిసిన తమిళనాడు ప్రీమియర్ లీగ్ లోనూ సత్తా చాటాడు.
ఇక తాజాగా ఎమర్జింగ్ ఆసియా కప్ 2023లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అజేయ సెంచరీతో రాణించాడు. సాయి సుదర్శన్ లో అద్భుతమైన ఒక విషయం ఉంది. అదేంటంటే అతడు సెహ్వాగ్ లా దూకుడుగా ఆడగలడు, అదే సమయంలో రా రాహుల్ ద్రవిడ్ లా వికెట్లు పడకుండా అడ్డుగోడలా నిలవగలడు. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయడంలో సాయి సుదర్శన్ దిట్ట అనే పేరును ఇప్పటికే తెచ్చేసుకున్నాడు. ఆసియా గేమ్స్ లో పాల్గొనే భారత జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. ఇదే ఫామ్ ను కంటిన్యూ చేస్తే త్వరలోనే టీమిండియాకు కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది.