Sakshi Malik: రెజ్లర్ల ఆందోళన నుంచి తప్పుకోలేదు.. అసలు విషయం చెప్పిన సాక్షి మాలిక్, భజరంగ్

సత్యాగ్రహం (ఆందోళన)తోపాటు రైల్వేలో ఉద్యోగం చేయాల్సిన బాధ్యత కూడా తమపై ఉందని సాక్షి మాలిక్ తెలిపారు. తాను విధి నిర్వహణ కోసమే రైల్వేల్లో తిరిగి విధుల్లో చేరుతున్నట్లు చెప్పారు. అంతేకానీ.. ఉద్యమం నుంచి బయటకు వెళ్లడం లేదన్నారు. మరోవైపు భజరంగ్ పునియా కూడా ఇదే తరహా ప్రకటన చేశారు.

  • Written By:
  • Publish Date - June 5, 2023 / 04:27 PM IST

Sakshi Malik: తాము రెజ్లర్లు చేస్తున్న ఆందోళనల నుంచి తప్పుకొన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్, భజరంగ్ పునియా ఖండించారు. ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదన్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయితే, సత్యాగ్రహం (ఆందోళన)తోపాటు రైల్వేలో ఉద్యోగం చేయాల్సిన బాధ్యత కూడా తమపై ఉందని సాక్షి మాలిక్ తెలిపారు. తాను విధి నిర్వహణ కోసమే రైల్వేల్లో తిరిగి విధుల్లో చేరుతున్నట్లు చెప్పారు.

అంతేకానీ.. ఉద్యమం నుంచి బయటకు వెళ్లడం లేదన్నారు. మరోవైపు భజరంగ్ పునియా కూడా ఇదే తరహా ప్రకటన చేశారు. తాను కూడా ఉద్యమం నుంచి తప్పుకోలేదన్నాడు. తన ఉద్యమం చివరి వరకు కొనసాగుతుందని చెప్పాడు. తాము ఉద్యమం నుంచి తప్పుకొంటున్నట్లు, ఎఫ్ఐఆర్ వెనక్కు తీసుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ సింగ్‌ను అరెస్టు చేయాలంటూ రెజ్లర్లు ఢిల్లీలో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిరసనల నుంచి సాక్షి మాలిక్, భజరంగ్ పునియా తప్పుకొన్నట్లు ఈ రోజు ఉదయం నుంచి ప్రచారం జరిగింది. దీంతో ఈ అంశంపై ఇద్దరూ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా స్పష్టత ఇచ్చారు. తమపై తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని కోరారు.

న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. కాగా, బ్రిజ్ భూషన్ సింగ్‌ తమను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ రెజ్లర్లు కొంతకాలంగా దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. సాక్షి మాలిక్, వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియా, విజయేందర్ వంటి రెజ్లర్లు ఈ దీక్షలో పాల్గొన్నారు. తాజాగా ఈ అంశంపై చర్చించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెజ్లర్లను కలిశారు. గత శనివారం రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో అమిత్ షా రెజ్లర్లతో భేటీ అయ్యారు. ఈ భేటీ జరిగిన రెండు రోజుల్లోనే సాక్షి, భజరంగ్ ఉద్యమం నుంచి తప్పుకొంటున్నట్లు ప్రచారం జరిగింది. కాగా, బ్రిజ్ భూషన్ సింగ్‌ను అరెస్టు చేయాలంటూ రైతు సంఘాల నేతలు కూడా ఆందోళన చేస్తున్నారు. ఈ నెల 9లోపు అతడిపై చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు.