Wrestlers protest: రెజ్లర్లకు ఎదురుదెబ్బ.. నిరసనల నుంచి సాక్షి మాలిక్ ఔట్.. ఏం జరిగింది?

ఇంతకాలం నిరసనల్లో కీలకంగా ఉన్న సాక్షి మాలిక్ ఈ నిరసనల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించింది. అయితే, ఉన్నట్లుండి సాక్షి మాలిక్ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియలేదు.

Wrestlers protest: రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ సింగ్‌ను అరెస్టు చేయాలంటూ నిరసన చేస్తున్న రెజ్లర్లకు ఎదురుదెబ్బ తగిలింది. ఇంతకాలం నిరసనల్లో కీలకంగా ఉన్న సాక్షి మాలిక్ ఈ నిరసనల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించింది. అయితే, ఉన్నట్లుండి సాక్షి మాలిక్ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియలేదు.

కానీ, ఈ నిర్ణయం కచ్చితంగా రెజ్లర్ల దీక్షపై ప్రభావం చూపుతుంది. బ్రిజ్ భూషన్ సింగ్‌ తమను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ రెజ్లర్లు కొంతకాలంగా దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. సాక్షి మాలిక్, వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియా, విజయేందర్, వంటి రెజ్లర్లు ఈ దీక్షలో పాల్గొంటున్నారు. తాజాగా ఈ అంశంపై చర్చించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెజ్లర్లను కలిశారు. గత శనివారం రాత్రి ఢిల్లీలోన తన నివాసంలో అమిత్ షా రెజ్లర్లతో భేటీ అయ్యారు. భజరంగ్ పునియా, సాక్షి మాలిక్, సంగీతా ఫొగాట్, సత్యవర్త్ కడియన్ దాదాపు రెండు గంటలపాటు చర్చలు జరిపారు. ఈ చర్చల ద్వారా అమిత్ షా ఏం హామీ ఇచ్చారు అనే అంశంపై స్పష్టత లేదు. బ్రిజ్ భూషన్ సింగ్‌పై త్వరగా చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు అమిత్ షాను కోరారు.

దీనికి అమిత్ షా స్పందిస్తూ.. చట్టం అందరికీ సమానమే అని.. చట్టాన్ని తన పని తాను చేసుకుపోనివ్వండని కోరాడు. ఈ విషయాన్ని భజరంగ్ పునియా తెలిపారు. ఇంతకుమించి ఈ సమావేశం గురించి చెప్పలేమన్నాడు. అమిత్ షాను కలిసిన రెండో రోజే సాక్షి మాలిక్ ఈ దీక్ష నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించడం విశేషం. ఈ ఆందోళన నుంచి తప్పుకొంటున్నట్లు, తిరిగి తన రైల్వే ఉద్యోగంలో చేరబోతున్నట్లు ప్రకటించింది. సాక్షి మాలిక్ నిర్ణయం రెజ్లర్ల దీక్షను మలుపు తిప్పుతుందేమో చూడాలి.
ఎందుకు తప్పుకొన్నట్లు?
సాక్షి మాలిక్ ఎందుకు తప్పుకొంది అనే విషయంలో స్పష్టత లేదు. అనేక ఉద్యమాల్ని నీరుగార్చడం రాజకీయ నేతలు, పార్టీలు, ప్రభుత్వాలకు అలవాటే. బెదిరించడం, భయపెట్టడం, మభ్యపెట్టడం వంటి అనేక కారణాలతో రకరకాలు ఉద్యమాల్ని పాలకులు నీరుగారుస్తుంటారు. రెజ్లర్ల ఉద్యమం నుంచి సాక్షి మాలిక్ తప్పుకొన్న నేపథ్యంలో క్రమంగా ఇది కూడా అలాగే నీరుగారుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.