Sanju Samson: సంజూ సలార్

టీమిండియా వెటరన్ బ్యాటర్ సంజూ శాంసన్ దుమ్మురేపాడు. వెస్టిండీస్‌తో చివరి వన్డేలో హాఫ్ సెంచరీతో మెరిసాడు.

  • Written By:
  • Publish Date - August 2, 2023 / 03:26 PM IST

తనదైన బ్యాటింగ్‌తో వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. నెంబర్ 4 స్థానానికి తాను సరిగ్గా సరిపోతానని చాటి చెప్పాడు. వచ్చి రావడంతోనే సిక్స్‌లు బాదిన సంజూ శాంసన్ 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 2 ఫోర్లు మాత్రమే కొట్టిన సంజూ శాంసన్.. నాలుగు భారీ సిక్సర్లతో అభిమానులను అలరించాడు. అయితే ఎదుర్కొన్న రెండో బంతినే సంజూ శాంసన్ సిక్సర్‌గా బాదడం ఈ ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది. యాన్నిక్ కారయ్య వేసిన 24 ఓవర్ రెండో బంతికి క్విక్ డబుల్ తీసిన సంజూ మరుసటి బంతిని లాంగాన్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. ఈ సిక్సర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. అభిమానులు ఈ షాట్‌కు ఫిదా అయ్యారు. ‘ఏమి గుండెరా అది.. రెండో బంతికే సిక్సరా’అంటూ సంజూను కొనియాడారు.

గత మ్యాచ్‌లో సంజూ విఫలమైనప్పుడు విమర్శించిన వారికి ఈ ఇన్నింగ్స్ చెంప పెట్టని, అవకాశాలు ఇస్తే సంజూ గొప్ప ఆటగాడిగా ఎదిగేవాడని కామెంట్ చేస్తున్నారు. ఈ ఇన్నింగ్స్‌తోనైనా అతనికి వరుస అవకాశాలు ఇవ్వాలని బీసీసీఐకి సూచిస్తున్నారు. గత మ్యాచ్‌లో విఫలమైన సంజూ.. ఎదుర్కొన్న రెండో బంతినే సిక్సర్ బాదాడంటే.. ఎంత గట్స్ ఉండాలని ప్రశంసిస్తున్నారు. అదే ఓవర్ చివరి బంతిని కూడా సిక్సర్‌గా మలిచిన సంజూ.. అదే జోరులో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరంగా మారిన సంజూ శాంసన్ను రోమారియా షెఫెర్డ్ క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 69 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. చివరిదైన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఏకంగా 200 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తుచేసి.. మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.