Sathwik Sai Raj: ప్రపంచ ఛాంపియన్ కు ముచ్చెమటలు.. అమలాపురం కుర్రోడి ఊరమస్.. సైనా, సింధులను మించిన క్రేజ్

ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 టోర్నీలో భారత బ్యాడ్మింటన్‌ టాప్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి‌లు చరిత్ర సృష్టించారు. సంచలన ఆట తీరుతో ఈ టోర్నీ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.

  • Written By:
  • Publish Date - June 19, 2023 / 04:56 PM IST

ఈ విజయంతో సూపర్ 1000 టోర్నీ గెలిచిన తొలి భారత జోడీగా చరిత్రకెక్కారు. సాత్విక్ సాయిరాజ్ ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురానికి చెందినవాడు కావడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఏడో సీడ్ సాత్విక్-చిరాగ్ జోడీ 21-17, 21-18 తేడాతో ప్రపంచ ఛాంపియన్స్‌ అయిన మలేషియాకు చెందిన ఆరోన్‌ చియా-సో వుయ్‌ ద్వయాన్ని మట్టి కరిపించారు. 28 నిమిషాల్లోనే ముగిసిన ఫైనల్ పోరులో సాత్విక్ జోడీ తిరుగులేని బేస్‌లైన్ గేమ్‌తో పాటు సుదీర్ఘమైన ర్యాలీలతో విజయాన్నందుకున్నారు. వరుస గేమ్‌ల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించారు.

రెండో గేమ్‌లో ప్రత్యర్థి ద్వయం నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా.. నిలకడగా ఆడిన సాత్విక్ జోడీ ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా గేమ్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచారు. గత కొంత కాలంగా బీడబ్ల్యూఎఫ్‌ సర్క్యూట్‌లో సాత్విక్ జోడీ నిలకడగా రాణిస్తోంది. ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్‌-చిరాగ్‌ 21-13, 21-13తో ఇండోనేసియాకు చెందిన టాప్‌సీడ్‌ జంట ఫజర్‌ అల్ఫియాన్‌-మహ్మద్‌ రియాన్‌ను వరుసగేముల్లో ఓడించి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకుంది. ఇక భారత బ్యాడ్మింటన్‌ అంటే.. సైనా నెహ్వాల్‌, పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌.. ఇలా సింగిల్స్ ప్లేయర్లే ఆధిపత్యం చెలాయిస్తున్న క్రమంలో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ డబుల్స్ స్టార్స్‌గా దూసుకొచ్చారు. గతేడాది బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన ఈ జోడీ.. ఇప్పుడు ఇండోనేషియా ఓపెన్‌ టైటిల్‌ను కూడా తన ఖాతాలో వేసుకుంది.