ICC World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీకి మరికొద్ది గంటల్లో తెరలేవనుంది. సుమారు రెండు నెలలపాటు ఈ మెగా టోర్నీ అభిమానులను అలరించనుంది. 10 జట్లు పాల్గొనే ప్రపంచకప్‌లో మొత్తం 47 మ్యాచ్‌లు జరగనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గురువారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ ప్రపంచకప్ ఎవరు గెలుస్తారనే ప్రశ్న విషయంలో అనేక సమాధానాలు వినిపించాయి.
సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజ ఆటగాళ్లు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ టైటిల్ నిలబెట్టుకుంటుందని చెప్పగా.. ఇతర మాజీ ప్లేయర్లు భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ పేర్లను సూచించారు. సొంతగడ్డపై జరగనున్న ఈ మెగా టోర్నీలో టైటిల్ గెలిచే అవకాశాలు టీమిండియాకే ఎక్కువగా ఉన్నాయని ఇంకొంతమంది అభిప్రాయపడ్డారు. అయితే సైంటిఫిక్ ఆస్ట్రాలజర్‌గా గుర్తింపు పొందిన గ్రీన్‌స్టోన్ లోబో మాత్రం టీమిండియానే టైటిల్ గెలుస్తుందని స్పష్టం చేశారు. తాజాగా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన గ్రీన్‌స్టోన్, రోహిత్ శర్మనే టైటిల్ అందుకునే అవకాశాలున్నాయని జోస్యం చెప్పాడు. రోహిత్ శర్మ 1987లో పుట్టడమే దీనికి ప్రధాన కారణమని లోబో చెప్పుకొచ్చారు. అయితే భారత్ అంత సులువుగా టైటిల్ గెలవదని, మిగతా జట్లతో తీవ్రంగా పోటీ ఉంటుందని స్పష్టం చేశారు.
గతంలో లోబో చెప్పిన ప్రిడిక్షన్స్ అన్నీ నిజమవ్వడంతో అతని జోస్యానికి ప్రాధాన్యం సంతరించుకుంది. 2011లో భారత్ ప్రపంచకప్ గెలుస్తుందని చెప్పిన లోబో.. 2015 వన్డే ప్రపంచకప్‌లో ఆసీస్ గెలుస్తుందని చెప్పాడు. 2019లో ఇంగ్లండ్ జట్టు కైవసం చేసుకుంటుందన్నాడు. అతను చెప్పినట్లుగానే ఈ మూడు టోర్నీల్లోనూ జరిగింది. సౌతాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లండ్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నా.. భారత్ విజయాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశాడు.