ఆ రోజే ఎందుకు… ? ధోనీ రిటైర్మెంట్ సీక్రెట్ ఇదే

  • Written By:
  • Publish Date - August 15, 2024 / 04:09 PM IST

దేశానికి రెండు ప్రపంచకప్ లు అందించిన లెజెండ్ గా మహేంద్రసింగ్ ధోనీ భారత క్రికెట్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా నిలిచిపోయాడు. మైదానంలో ఎంత ఒత్తిడి ఉన్నా కూల్ గా జట్టును లీడ్ చేయడం మహీకే చెల్లింది. ధోనీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది గ్రౌండ్ లోనైనా, ఆఫ్ ది ఫీల్డ్ అయినా సంచలనమే కాదు అందరికీ షాక్ గానే ఉండేది. తన రిటైర్మెంట్ విషయంలోనూ ధోనీ ఇదే ఫాలో అయ్యాడు. 2020 ఆగష్ట్ 15న అంతర్జాతీయ క్రికెట్ కు ధోనీ వీడ్కోలు పలికాడు. అయితే ధోని రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన‌ కొద్ది నిమిషాల‌కే మ‌రో స్టార్ క్రికెట‌ర్‌ సురేష్ రైనా కూడా అంత‌ర్జాతీయ క్రికెట్ త‌ప్పుకుంటున్నాన‌ని షాకింగ్ ప్ర‌క‌ట‌న చేశాడు.

ఒకే రోజు ఇద్ద‌రు స్టార్‌ క్రికెట‌ర్లు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం అప్పట్లో అందరినీ షాక్ కు గురి చేసింది. తాజాగా ఆగష్ట్ 15నే రిటైర్మెంట్ ప్ర‌క‌టించడం వెన‌క‌గ‌ల కార‌ణాన్ని సురేష్ రైనా వెల్ల‌డించాడు. ధోనీ జెర్సీ నంబర్ 7, తన జెర్సీ నంబ‌ర్ 3… రెండు క‌లిపితే 73 అవుతుందనీ, 2020 ఆగష్టు 15వ తేదీకి స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు పూర్తవడంతో ఇంత‌కంటే మంచి రోజు మరొకటి ఉండదని భావించినట్టు చెప్పాడు. తామిద్దరం అంతర్జాతీయ క్రికెట్‌లో 15 ఏళ్లు క‌లిసి ప్ర‌యాణించామని, రిటైరయ్యాక ఐపీఎల్‌లో కొనసాగాలని నిర్ణయించుకున్నామని రైనా చెప్పుకొచ్చాడు.