Shaheen Afridi: మొదట బ్యాట్ విరిగింది రెండో బంతికి వికెట్ ఎగిరింది

రెండు నెలలపాటు ఆటకు దూరమైన షాహీన్.. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో సత్తా చాటుతున్నాడు. లాహోర్ ఖాలండర్స్ (lahore qalandars) కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న షాహీన్.. పెషావర్ జాల్మీ (peshawar zalmi)తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లతో చెలరేగాడు.

  • Written By:
  • Updated On - February 27, 2023 / 07:51 PM IST

పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో పాక్ ప్రధాన పేసర్ షాహీన్ అఫ్రిదీ (Shaheen Afridi) అదరగొట్టే ప్రదర్శన చేశాడు. లాహోర్ ఖాలండర్స్ (lahore qalandars) కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న షాహీన్.. పెషావర్ జాల్మీ (peshawar zalmi)తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లతో చెలరేగాడు. దీంతో లాహోర్ జట్టు 40 పరుగుల తేడాతో బాబర్ ఆజమ్ టీమ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లాహోర్.. ఫకర్ జమాన్, అబ్దుల్లా షఫీఖ్ సామ్ బిల్లింగ్స్ రాణించడంతో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పెషావర్‌ను షాహీన్ అఫ్రిదీ ఆరంభంలోనే హడలెత్తించాడు. షాహీన్ సంధించిన ఇన్నింగ్స్ తొలి బంతికి.. మహ్మద్ హారీస్ బ్యాట్ విరిగి రెండు ముక్కలైంది. రెండో బంతికే హారీస్‌ను షాహీన్ క్లీన్ బౌల్డ్ చేయగా.. స్టంప్స్ ఎగిరి పడ్డాయి. తన తర్వాతి ఓవర్లో పెషావర్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను సైతం షాహీన్ బౌల్డ్ చేశాడు. తద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా పేరొందిన బాబర్‌పై ఆధిపత్యం చెలాయించాడు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన షాహీన్ ముగ్గురు బ్యాటర్లను బౌల్డ్ చేయడం గమనార్హం.28 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయినప్పటికీ.. మిడిలార్డర్ బ్యాటర్లు సాయిమ్ ఆయూబ్, టామ్ కోహ్లెర్ క్యాడ్‌మోర్ రాణించడంతో.. పెషావర్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. విజయానికి 41 పరుగుల దూరంలో నిలిచింది.

మోకాలి సర్జరీ కారణంగా చాలా కాలంపాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న షాహీన్.. టీ20 వరల్డ్ కప్ ఆడటం కోసం నేరుగా ఇంగ్లాండ్ (England) నుంచి ఆస్ట్రేలియా (Australia) బయలదేరి వెళ్లాడు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో బౌలింగ్ చేస్తుండగా.. గాయం తిరగబెట్టడంతో.. బౌలింగ్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత రెండు నెలలపాటు ఆటకు దూరమైన షాహీన్.. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో సత్తా చాటుతున్నాడు.