మిస్టర్ ఐసీసీ అంటే అతనే మెగా టోర్నీల్లో ధావన్ రికార్డులు

  • Written By:
  • Publish Date - August 24, 2024 / 08:34 PM IST

అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన శిఖర్ ధావన్ కు మిస్టర్ ఐసీసీగా పేరుంది. ఎందుకంటే మెగా టోర్నీలంటే చాలు గబ్బర్ కు పూనకం వస్తుంది. సాధారణంగా వరల్డ్ కప్ , ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ఐసీసీ టోర్నీల్లో నిలకడగా రాణించడం అంత ఈజీకాదు. ఒత్తిడిని తట్టుకుని ప్రపంచ స్థాయి టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన కనబరచడం ఒక్కో సందర్భాల్లో దిగ్గజ ఆటగాళ్ళకే సాధ్యం కాదు. అలాంటిది ప్రతీసారి ధావన్ ఐసీసీ టోర్నీల్లో చెలరేగిపోయేవాడు. వరుస శతకాలతో బౌలర్లకు చుక్కలు చూపించాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలోనూ గబ్బర్ దే కీరోల్. ఆ మెగా టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. అలాగే 2015 వరల్డ్ కప్ లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు.

ఇక 2019 వన్డే వరల్డ్‌కప్‌లోనూ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగే వరకూ అతని జోరు కొనసాగింది. ఆ మెగా టోర్నీలో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన గబ్బర్ రెండో మ్యాచ్‌ల్లోనూ సెంచరీలు సాధించాడు. చివరికి ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో వేలికి తీవ్ర గాయమైనా 117 పరుగులు చేశాడు. ఐసీసీ టోర్నీల్లో శిఖర్ ధావన్ ను ఔట్ చేసేందుకు ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనబడేవి. దాదాపు ఆరేళ్ల పాటు ఐసీసీ టోర్నీల్లో గబ్బర్ హవా కొనసాగింది. అయితే 2022 చివర్లో యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్ రూపంలో యంగ్ ఓపెనర్ల రాకతో శిఖర్ ధావన్‌కి కష్టాలు మొదలయ్యాయి. ఫామ్ కోల్పోవడం, ఫిట్‌నెస్ అతని కెరీర్‌ను దెబ్బతీసింది. దాంతో భారత్ జట్టుకు దూరమైపోయాడు. గత రెండేళ్లుగా భారత సెలెక్టర్ల పిలుపు కోసం ఎదురుచూసిన ధావన్ వీడ్కోలు మ్యాచ్ ఆడకుండానే గుడ్ బై చెప్పేశాడు.