ఐపీఎల్ (IPL) లో విదేశీ స్టార్ ప్లేయర్స్ (Foreign star players) కు ఫ్రాంచైజీలు దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతున్నాయి. నిజానికి చాలా ఫ్రాంచైజీలు మొదటి నుంచి ఓ సమస్యను ఎదుర్కొంటున్నాయి. కొందరు విదేశీ ప్లేయర్లు సీజన్ ప్రారంభమయ్యే కొన్ని రోజుల ముందు ఆడలేమంటూ చెప్పేస్తున్నారు. సరైన కారణాలు చెప్పకుండా సీజన్ నుంచి తప్పుకుంటున్నారు. దీంతో జట్టు కూర్పు సహా చాలా విషయాల్లో ఫ్రాంచైజీలు చేసుకున్న ప్లాన్‍లు తప్పుతున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్ 2024 (IPL 2024) సీజన్‍లోనూ ఇది జరిగింది. జేసన్ రాయ్, అలెక్స్ హేల్స్, వనిందు హసరంగ సహా మరికొందరు ఆటగాళ్లు సీజన్ మొదలయ్యే కొన్ని రోజుల ముందే తాము ఆడబోమంటూ ప్రకటించారు.
దీంతో ఈ విషయంపై బీసీసీఐ ముందు ఐపీఎల్ (IPL) ఫ్రాంచైజీలు కీలక ప్రతిపాదనను ఉంచాయని సమాచారం.. సరైన కారణాలు లేకుండా సీజన్ నుంచి తప్పుకునే విదేశీ ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీసీఐను ఫ్రాంచైజీలు కోరాయి. బలమైన కారణం లేకుండా సీజన్ నుంచి తప్పుకునే విదేశీ ఆటగాళ్లపై ఐపీఎల్ నుంచి నిషేధించాలని ఫ్రాంచైజీలు బీసీసీఐ కి ప్రతిపాదనలు చేశాయని తెలుస్తోంది. బీసీసీఐ (BCCI) సీఈవోతో ఫ్రాంచైజీలు వేర్వేరుగా మాట్లాడిన సమయాల్లో ఈ విషయంపై ప్రస్తావన వచ్చిందని బోర్డు వర్గాలు తెలిపాయి. తాజాగా బీసీసీఐతో జరిగిన మీటింగ్ లోనూ ఈ విషయాన్ని కూడా ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది.