ఐపీఎల్ (IPL) 2024కు ముందు అన్ని ఫ్రాంచైజీలను గాయాలు వెంటాడుతున్నాయి. సీజన్ ఆరంభం కావడానికి ముందే పలువురు ఆటగాళ్ళు దూరమయ్యారు. ఈ జాబితాలో ముంబైకు ఆడుతున్న శ్రీలంక (Sri Lanka) ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంక కూడా చేరాడు. దిల్షాన్ మధుశంక గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ ఫస్ట్‌హాఫ్‌కు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. మధుశంక ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడతున్నాడు. బంగ్లాదేశ్ (Bangladesh) తో జరిగిన రెండో వన్డేలో గాయపడ్డ మధుశంక.. ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించి స్కాన్ చేయగా గాయం తీవ్రమైనదిగా తేలింది.
అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు 3 వారాల సమయం పట్టనున్నట్లు శ్రీలంక క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ అదే నిజమైతే అతడు ఐపీఎల్ తొలి దశకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఐపీఎల్ 2024 వేలంలో మధుశంకను ముంబై ఇండియన్స్ 4.6 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో (ODI World Cup) మధుశంక అద్బుతమైన ప్రదర్శన కనబరచడంతో ముంబై ఫ్రాంచైజీ అతడిని తమ జట్టులోకి తీసుకుంది.