వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ నిర్వహణ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కిందా మీదా పడుతోంది. నిధులను ఏదో విధంగా సమకూర్చుకుని స్టేడియాలను ఆధునీకరిస్తూ టోర్నీని గ్రాండ్ గా నిర్వహించాలని పట్టుదలగా ఉంది. ఇప్పటికే స్టేడియాల మరమ్మత్తు పనులను కూడా ప్రారంభించింది. అయితే పాక్ క్రికెట్ బోర్డుకు షాకిచ్చేలా కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ మెగా టోర్నీ ఫైనల్ కు బ్యాకప్ వేదికగా దుబాయ్ ను ఐసీసీ రిజర్వ్ చేసినట్టు సమాచారం. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు చేరుకుంటే ముందు జాగ్రత్తగానే ఐసీసీ దుబాయ్ ను మరో వేదికగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి పాక్ లో పర్యటించేందుకు అన్ని జట్లూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా భారత్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్ళేలా కనిపించడం లేదు. గత కొన్నేళ్ళుగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా తెగిపోవడమే దీనికి కారణం.
ఇప్పటికే ఈ విషయంలో బీసీసీఐ ఐసీసీకి తేల్చి చెప్పేసింది. తమ దేశ ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా పాక్ పర్యటనకు వచ్చేది లేదని తేల్చేసింది. అటు ప్రభుత్వం కూడా పాక్ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే భారత్ మ్యాచ్ లు తటస్థ వేదికలో నిర్వహించాలని బీసీసీఐ ఇప్పటికే ఐసీసీ దృష్టికి తీసుకెళ్ళింది. ఆసియాకప్ తరహాలోనే ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలోనూ హైబ్రిడ్ మోడల్ ను అమలు చేయాలని కోరింది. అయితే దీనికి పాక్ క్రికెట్ బోర్డు మాత్రం ససేమీరా అంటోంది. టోర్నీ మొత్తం పాక్ లోనే నిర్వహిస్తామంటూ పీసీబీ ఒక ప్రపోజల్ షెడ్యూల్ ను కూడా రెడీ చేసి ఐసీసీకి పంపించింది. పాక్ బోర్డు ఓవరాక్షన్ కు బీసీసీఐ కూడా ధీటుగానే స్పందించింది. టోర్నీ నుంచి తప్పుకునేందుకు కూడా తాము వెనుకాడబోమంటూ పరోక్షంగా సంకేతాలిచ్చింది.
అప్పటి నుంచీ పాక్ క్రికెట్ బోర్డుకు టెన్షన్ మొదలైంది. భారత్ ను ఎలాగైనా పాక్ కు రప్పించాలని వేడుకుంటోంది. కానీ బీసీసీఐ మాత్రం పాక్ రిక్వెస్టును అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. నిజానికి భారత్ లాంటి పెద్ద జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడకుంటే పాక్ బోర్డుకు ఆర్థికంగానూ పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పాలి. భారత్ ఆడకుంటే అసలు టోర్నీని చూసే అభిమానులు కూడా ఉండరు. అన్ని విధాలా పాక్ క్రికెట్ బోర్డుకు ఇది తీవ్ర నష్టాన్ని మిగల్చడం ఖాయం. ఈ పరిస్థితి రాకుండా నివారించేందుకు ఐసీసీ ఫైనల్ వేదికను మాత్రం ముందుగానే రిజర్వ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ హైబ్రిడ్ మోడల్ లో టోర్నీ నిర్వహిస్తే మాత్రం భారత్ ఆడే మ్యాచ్ లకు శ్రీలంక లేదా యుఏఈ ఆతిథ్యమిచ్చే అవకాశముంది.