Favouritism: క్రీడలంటేనే ఫేవరటిజం, లాబియింగ్‌లు..వినేశ్‌, మేరీకోమ్‌ ఎపిసోడ్‌లు చెబుతున్న నిజాలేంటి..?

రూల్‌ ఇజ్‌ రూల్.. రూల్‌ ఫర్‌ ఆల్‌..అయితే ఇది కేవలం పేపర్‌పై మాత్రమే.. ఆచరణలో శూన్యం..అది క్రీడలైనా..కోర్టు తీర్పులైనా మనిషిని బట్టి ఉంటుంది.

  • Written By:
  • Publish Date - July 19, 2023 / 04:30 PM IST

క్రికెట్‌లో ఫేవరటిజం గురించి గొంతు చించుకునే భారతీయులు..ఇతర క్రీడల్లో జరిగే అన్యాయాల పట్ల పెద్దగా రియాక్ట్ అవ్వరు.. ఎందుకంటే చాలా మంది ఇండియన్స్‌కి క్రికెట్‌ ఒక్కటే ఆట..మిగిలిన గేమ్స్‌ సందర్భం వచ్చినప్పుడే గుర్తొస్తాయి. అది కూడా ఒలింపిక్స్‌ లాంటి గేమ్స్ వచ్చినప్పుడు సోషల్‌మీడియాలో హడావుడి చేయడానికే కానీ అందులో రియాలిటీ ఉండదు. ఇక మిగిలిన క్రీడల సంబంధిత శాఖలు కూడా అవినీతిలో కూరుకుపోయి ఉంటాయి. వాళ్లకి నచ్చినవాళ్లకి జాతీయ జట్టులో చోటు కల్పించడం..ఇష్టమైన వాళ్లని వివిధ దేశాల్లో ప్రతిష్టాత్మక టోర్నీలకు పంపించడం షరా మాములే..ముఖ్యంగా బాక్సింగ్‌,రెజ్లింగ్‌లలో ఈ తరహా వైఖరి ఎక్కువగా కనిపిస్తుంటుంది. తాజాగా మరోసారి అదే జరిగింది. ఆసియా గేమ్స్‌కు స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌ను ఎలాంటి ట్రయల్స్ లేకుండా ఎంపిక చేయడం వివాదాస్పదమైంది.

అంతిమ్‌ పంఘాల్‌ ధ్వజం:
వినేశ్‌ ఫొగాట్‌ని ట్రయల్స్‌ లేకుండా ఎంపిక చేయడంపై రెజ్లర్‌ అంతిమ్‌ పంఘాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. గతేడాది జూనియర్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున స్వర్ణ పతకం సాధించానని.. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా నిలిచిన విషయం ఫెడరేషన్‌కి గుర్తులేదా అని ప్రశ్నించింది. 2023 ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌ టోర్నీలోనూ రజత పతకం గెలిచానని.. అటు వినేశ్ గత ఏడాది కాలంగా ఏ పతకాలు సాధించలేదని గుర్తుచేసింది. ఇక వినేశ్‌ గాయాలతో ఏడాదిగా ప్రాక్టీస్‌లోనే లేదు. అయినా ఆమెను నేరుగా ఎలా సెలక్ట్ చేస్తారంటూ నిలదీసింది. అటు ఒలంపిక్‌ పతకాలు సాధించిన సాక్షి మాలిక్‌ని ట్రయల్స్‌ లేకుండా ఎందుకు సెలక్ట్ చేయలేదో చెప్పాలని.. వినేశ్‌కి ఒక న్యాయం..మిగిలిన ప్లేయర్లకు ఒక న్యాయం ఉంటుందా అని మండిపడింది.

నిజమే కదా!:
అంతిమ్‌ పంఘాల్ వ్యాఖ్యలు సమర్థించదగినవే..ఎందుకంటే ఎంత గొప్ప క్రీడాకారులైనా నిబంధనలకు లోబడే ఉండాలి. ట్రయల్స్‌లో పాల్గొనాలి. మా దేశం మా ఇష్టం.. మేం ఏం చేసిన చెల్లుతుందనే వైఖరి సరైనది కాదు. ట్రయల్స్‌లో పాల్గొంటేనే కదా ఎవరి సత్తా ఎంటో తెలిసేది. నిజానికి ఈ ట్రయల్స్‌ కొట్లాటలు ఇప్పటివి కాదు. గతంలో లెజండరీ బాక్సర్‌ మేరీకోమ్‌ని ట్రయల్స్‌ లేకుండా ఒలంపిక్స్‌కి ఎంపిక చేయడంపై తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్పటినుంచి నిఖత్‌పై గుర్రుగా ఉన్న మేరీ ఆ తర్వాత ట్రయల్స్‌ ఆడేందుకు అంగీకరిచింది. ఆ ట్రయల్స్‌లో నిఖత్‌ ఓడిపోయింది. అయితే మ్యాచ్‌ తర్వాత మేరీ బిహెవియర్‌ పలు విమర్శలకు దారి తీసింది. బౌట్‌కి ముందు బాక్సర్స్ ఫార్మల్‌గా ఇచ్చుకునే హగ్‌కు కోమ్ స్పందించలేదు. జరీన్‌.. మేరీకి షేక్‌హ్యాండ్‌ ఇవ్వబోగా అందుకు కూడా ఆమె తిరస్కరించింది. అంతేకాదు బౌట్ జరుగుతున్నప్పుడు మేరీకోమ్ నిరంతరం తనను దూషించిందని, ఒకసారి తీవ్ర పదజాలం ఉపయోగించిందని..జరీన్ చెప్పుకొచ్చింది. ఇక్కడ జరీన్‌ అడిగినదాంట్లో ఏ మాత్రం తప్పులేదు. అయినా ఆట కంటే తానే ఎక్కువ అని మేరీ భావించిందో ఏమో కానీ..ఆమె ప్రవర్తన అక్కడున్న వాళ్లని షాక్‌కి గురిచేసింది. ఇలా ట్రయల్స్‌ పెట్టకుండా, జూనియర్లకు అవకాశాలు ఇవ్వకుండా, అడిగితే కక్ష పెంచుకోవడం లాంటివి చేయడం ఇండియాలో అనాదిగా వస్తుండగా..తాజాగా వినేశ్‌ ఎపిసోడ్‌ అదే విషయాన్ని మరోసారి ప్రూవ్‌ చేసింది.