భారత క్రికెట్ జట్టులో చోటు దక్కడం ఎంత కష్టమో…దానిని నిలబెట్టుకోవడం అంత కంటే కష్టం… ఎప్పటికప్పుడు ఫామ్ కొనసాగిస్తేనే జట్టులో ఉంటారు.. లేకుంటే వేటు పడుతుంది..కేవలం ఆట ఒక్కటే సరిపోదు ఫిట్ నెస్, క్రమశిక్షణ కూడా ఉంటేనే కెరీర్ లో ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ విషయంలో శ్రేయాస్ అయ్యర్ కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఒకప్పుడు మిడిలార్డర్ లో కీలక ఆటగాడిగా పేరు తెచ్చుకున్న అయ్యర్ గత ఏడాది చివరి నుంచి గాడి తప్పాడు. ఫామ్ కోల్పోవడమే కాదు సెంట్రల్ కాంట్రాక్టునూ చేజార్చుకున్నాడు. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ను ఛాంపియన్ గా నిలిపినా అంతర్జాతీయ స్థాయిలో మాత్రం ఫ్లాప్ షో కనబరుస్తున్నాడు.
తాజాగా దులీప్ ట్రోఫీ ఆడుతున్న అతడికి సెంట్రల్ కాంట్రాక్ట్ తో పాటుగా జట్టులో చోటు దక్కుతుందని అంతా అనుకున్నారు. అయితే సెలక్టర్లు మాత్రం అయ్యర్ ను పట్టించుకోలేదు. ఇటీవలే ముగిసిన బుచ్చిబాబు ట్రోఫీలో, ప్రస్తుత దులీప్ ట్రోఫీలోనూ స్థాయికి తగినట్టు ఆడలేకపోవడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. అదే సమయంలో సర్ఫరాజ్ ఖాన్, కెెఎల్ రాహుల్ నుంచి గట్టిపోటీ ఎదురుకావడంతో శ్రేయాస్ కు అవకాశమే లేకుండా పోయింది. అయ్యర్ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలంటే దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణించాల్సిందే. వచ్చే రంజీ సీజన్ అతని కెరీర్ ను డిసైడ్ చేసే అవకాశముంది.