Ganguly And Sehwag: అప్పుడు వాళ్ళు

వెస్టిండీస్‌పై తొలి రెండు వన్డేల్లో ప్రదర్శన భారత జట్టు ఆటతీరుపై సందేహాలు రేకెత్తించినా.. తమ స్థాయి ఏమిటో చివరి పోరులో టీమిండియా చూపించింది. ఇద్దరు స్టార్‌ బ్యాటర్లు ఆడకపోయినా, ప్రత్యర్థిని చిత్తు చేయగల సత్తా తమకుందని నిరూపించింది.

  • Written By:
  • Publish Date - August 3, 2023 / 07:25 PM IST

ఆఖరి వన్డేలో భారీ విజయంతో సిరీస్‌ను సొంతం చేసుకున్న జట్టు ఇప్పుడు టి20 పోరుకు సిద్ధమైంది. మూడో వన్డేలో టీమిండియా యువ ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌, శుబ్‌మన్‌ గిల్‌ అర్ధ శతకాలతో మెరిసిన విషయం తెలిసిందే. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ 64 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 77 పరుగులు రాబట్టగా.. గిల్‌ 92 బంతుల్లో 11 బౌండరీలు బాది మొత్తంగా 85 రన్స్‌ చేశాడు. మొదటి వికెట్‌కు 19.4 ఓవర్లలో వీరిద్దరు కలిసి 143 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ఈ క్రమంలో టీమిండియా వెటరన్‌ క్రికెటర్లు శిఖర్‌ ధావన్‌- అజింక్య రహానే పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టారు. కాగా 2017లో ఈ జోడీ వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్‌లో మొదటి వికెట్‌కు 132 పరుగులు జతచేశారు. ఈ క్రమంలో ఆరేళ్ల తర్వాత వీరి రికార్డును లెఫ్ట్‌- రైట్‌ కాంబినేషన్‌ ఓపెనింగ్‌ పెయిర్‌ బ్రేక్‌ చేసి కొత్త చరిత్ర సృష్టించింది. అదే విధంగా.. కరేబియన్‌ దీవిలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఏ వికెట్‌పై అయినా అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన రెండో భారత జోడీగా నిలిచింది. 2007 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ సందర్భంగా బెర్ముడాపై సౌరవ్‌ గంగూలీ- వీరేంద్ర సెహ్వాగ్‌ రెండో వికెట్‌కు 202 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో వీరి తర్వాతి స్థానాన్ని ఇషాన్‌- గిల్‌ ఆక్రమించారు.