కెప్టెన్సీకి సౌథీ గుడ్ బై కివీస్ కొత్త సారథిగా ఎవరంటే ?

భారత్ తో మూడు టెస్టుల సిరీస్ కు ముందు న్యూజిలాండ్ జట్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లంక పర్యటనలో చిత్తుగా ఓడిన నేపథ్యంలో కివీస్ సారథ్య బాధ్యతల నుంచి పేస్ బౌలర్ టిమ్ సౌథీ తప్పుకున్నాడు.

  • Written By:
  • Publish Date - October 2, 2024 / 04:06 PM IST

భారత్ తో మూడు టెస్టుల సిరీస్ కు ముందు న్యూజిలాండ్ జట్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లంక పర్యటనలో చిత్తుగా ఓడిన నేపథ్యంలో కివీస్ సారథ్య బాధ్యతల నుంచి పేస్ బౌలర్ టిమ్ సౌథీ తప్పుకున్నాడు. 2022 డిసెంబర్‌లో కేన్ విలియమ్సన్ స్థానంలో సౌథి టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు. సారథిగా 14 టెస్టుల్లో న్యూజిలాండ్‌ను సౌథీ నడిపించాడు. కెప్టెన్ గా ఆరు మ్యాచ్ లో జట్టును గెలిపించిన సౌథీ 6 ఓటములనూ చవిచూశాడు. లంక టూర్ లో వచ్చిన ఫలితంతోనే అతను కెప్టెన్సీకి గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది. కాగా తన నిర్ణయం కివీస్ జట్టుకు మేలు చేస్తుందని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. సంప్రదాయ ఫార్మాట్ లో న్యూజిలాండ్ సారథిగా వ్యవహరించడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా పేర్కొన్నాడు.

ఇక మైదానంలో తన ప్రదర్శనపై మరింత దృష్టి పెడతానని చెప్పుకొచ్చాడు. సౌథీ ఇప్పటి వరకూ 102 టెస్టుల్లో 382 వికెట్లు, 161 వన్డేల్లో 221 వికెట్లు, 125 టీ ట్వంటీల్లో 164 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే టిమ్ సౌథీ స్థానంలో న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్‌గా టామ్ లాథమ్ ఎంపికయ్యాడు.ఓపెనర్ గా కివీస్ కు కీలక ఆటగాడిగా ఉన్న లాథమ్ ఇప్పటి వరకూ 82 టెస్టులు, 147 వన్డేలు, 26 టీ ట్వంటీలు ఆడాడు. కాగా భారత పర్యటనలో న్యూజిలాండ్ మూడు టెస్టుల సిరీస్ ఆడనుండగా.. తొలి టెస్ట్ బెంగళూరు వేదికగా అక్టోబర్ 16 నుంచి మొదలవుతుంది.