Ashwin: అనిల్ కుంబ్లే టార్గెట్!

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్‌ 141 పరుగుల తేడాతో గెలిచింది. వెటరన్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన స్పిన్‌ మాయాజాలంతో విండీస్‌ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు.

  • Written By:
  • Publish Date - July 15, 2023 / 01:51 PM IST

తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్స్ తీసిన యాష్.. రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టాడు. తొలి టెస్టులో మొత్తంగా 131 పరుగులు ఇచ్చి 12 వికెట్లు తీసి.. కెరీర్‌ బెస్ట్‌ ప్రదర్శన నమోదు చేశాడు. దాంతో మాజీ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌ రికార్డును అశ్విన్‌ బద్దలుకొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టడంతో అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్స్ తీసిన రెండో బౌలర్‌గా రవిచంద్రన్‌ అశ్విన్‌నిలిచాడు. ఈ క్రమంలో హర్భజన్‌ సింగ్‌ను 707 వికెట్లను యాష్ అధిగమించాడు. ప్రస్తుతం అశ్విన్ ఖాతాలో 709 వికెట్లు ఉన్నాయి. టెస్టుల్లో 486 వికెట్లు, వన్డేల్లో 151, టీ20ల్లో 72 వికెట్లు పడగొట్టాడు.

ఇక అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ముందున్నాడు. జంబో 953 వికెట్స్ తీశాడు. ఇక యాష్ కుంబ్లేను టార్గెట్ చేశాడు. అయితే అది సులువు మాత్రం కాదు. అశ్విన్‌ ఈ మ్యాచ్‌లో 12 వికెట్లు తీశాడు. ఒకే మ్యాచ్‌లో 10 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడం ఇది ఎనిమిదోసారి. ఈ క్రమంలో అనిల్‌ కుంబ్లేతో యాష్ సమంగా నిలిచాడు. కుంబ్లే టెస్టుల్లో 10 ప్లస్ వికెట్లను ఎనిమిది సార్లు తీశాడు. అశ్విన్‌ 5 వికెట్ల ప్రదర్శన చేయడం ఇది 34వసారి. ఐదు వికెట్ల ప్రదర్శనప్పుడు జట్టు విజేతగా నిలవడం ఇది 28వ సారి. స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీ ధరన్ 41 మ్యాచుల్లో అత్యధిక విజయాల్లో భాగస్వామ్యం అయ్యాడు.