హాకీ వాల్ కు సలామ్.. ముగిసిన యోధుడి కెరీర్

  • Written By:
  • Publish Date - August 9, 2024 / 02:46 PM IST

భారత్ క్రికెట్ పేరు చెప్పగానే కపిల్ దేవ్, సచిన్, గంగూలీ, కోహ్లీ… ఇలా ఠక్కున పేర్లు చెప్పేస్తారు.. అయితే హాకీ పేరు చెబితే ఎంతమంది పేర్లు చెప్పగలరు.. ధ్యాన్ చంద్, ధనరాజ్ పిళ్ళై…ఇంకా చాలామంది దిగ్గజ ఆటగాళ్ళు మన జాతీయ క్రీడలో ఓ వెలుగు వెలిగారు. క్రికెట్ కు ఉన్న క్రేజ్ తో వారికి అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదన్నది వాస్తవం.. భారత క్రికెట్ లో ది వాల్ అనగానే గుర్తొచ్చే పేరు రాహుల్ ద్రావిడ్… అలాగే హాకీలో కూడా అలాంటి వాల్ ఉన్నాడు.. అతనే భారత హాకీ జట్టు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్… ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ టీమ్ కాంస్యం గెలిచిందంటే శ్రీజేషే కారణం… ప్రత్యర్థి జట్ల దాడులకు గోల్ పోస్ట్ దగ్గర అడ్డుగోడలా నిలబడిపోయాడు.

స్కూల్ స్థాయి నుంచే హాకీలో అద్భుతమైన ప్రతిభను కనబరిచాడు శ్రీజేష్… ఇక గ్రాడ్యూయేషన్ తర్వాత పూర్తిగా హాకీపైనే ఫోకస్ పెట్టాడు. 2004లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ హాకీలోకి గోల్ కీపర్ గా అరంగేట్రం చేశాడు. కేవలం కేవలం రెండేళ్ళలోనే సీనియర్ జట్టులో చోటు దక్కించుకున్నాడంటే అతని సత్తాను అర్థం చేసుకోవచ్చు. శ్రీజేష్ గోల్ పోస్ట్ కు అడ్డుగా ఉన్నాడంటే.. ప్రత్యర్థులకు దడ పుట్టాల్సిందే. గోల్ పోస్ట్ పై దాడులు చేసి, చేసి ప్రత్యర్థులు అలసిపోవాలే తప్ప వారికి మాత్రం గోల్ కొట్టే ఛాన్స్ ఇవ్వడు. ఎన్నోసార్లు బెస్ట్ గోల్ కీపర్ గా అవార్డులు అందుకున్నాడు . అందుకే అభిమానులు ది గ్రేట్ ఇండియన్ వాల్ ఆఫ్ హాకీ అంటూ పిలుచుకుంటారు.

గత దశాబ్దకాలంగా వరల్డ్ హాకీలో బెస్ట్ గోల్ కీపర్ గా నిలిచాడు. శ్రీజేష్ ప్రతిభ గురించి ప్రత్యర్థి జట్లకే బాగా తెలుసు. టోక్యో ఒలింపిక్స్ లోనూ, ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ లోనూ అత్యుత్తమ జట్లుగా పేరున్న స్పెయిన్, జర్మనీ, బెల్జియంకు సవాల్ గా నిలిచాడు. పారిస్ ఒలింపిక్స్ తో తన కెరీర్ ను ముగిస్తున్నట్టు ముందే ప్రకటించాడు. తన ఆఖరి మ్యాచ్‌లోనూ గోల్‌కీపర్‌గా శ్రీజేష్ తన మార్క్ చూపించాడు. భారత గోల్ పోస్ట్‌కు అడ్డు గోడలా నిల్చొని స్పెయిన్ గోల్స్‌ను సమర్థవంతంగా అడ్డుకున్నాడు. కాంస్యం గెలిచిన తర్వాత భారత ఆటగాళ్లు శ్రీజేష్‌కు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. తమ భుజాలపై ఎత్తుకొని గోల్ పోస్ట్‌ పోల్‌పై కూర్చోబెట్టారు. అనంతరం తమ హాకీ స్టిక్స్‌తో శ్రీజేష్‌కు జేజేలు పలికారు. దీంతో రెండు దశాబ్దాల సుధీర్ఘమైన కెరీర్ కు ఒలింపిక్ పతకంతో శ్రీజేష్ ఘనంగా ముగింపు పలికాడు.