ఐపీఎల్ 2024 సీజన్ చివరి అంకానికి చేరుకుంది.ప్లే ఆఫ్ సమరానికి కౌంట్ డౌన్ మొదలయింది. మంగళవారం జరిగే తొలి క్వాలిఫయర్ లో టేబుల్ టాపర్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. అసాధారణ ప్రదర్శనతో పాటు అదృష్టం కూడా కలిసి రావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో నిలిచింది. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లో కేకేఆర్ విజయం సాధించింది. అయితే ఈ రెండు మ్యాచ్‌లు హోరా హోరీగా సాగాయి.ఈ క్రమంలోనే క్వాలిఫయర్ మ్యాచ్ కూడా థ్రిల్లర్‌గా సాగుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అహ్మదాబాద్ పిచ్ గురించి ప్యాట్ కమిన్స్‌కు మంచి అవగాహన ఉంది. ఇదే వికెట్‌పై అతను ఆసీస్‌కు వరల్డ్ కప్ అందించాడు. ఈ క్రమంలోనే తుది జట్టులో అతను వ్యూహాత్మక మార్పులు చేసే అవకాశం ఉంది.
అహ్మదాబాద్ పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో టీమ్ కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు చేయకపోయినా.. బెంచ్‌కే పరిమితమైన న్యూజిలాండ్ విధ్వంసకర ఆల్‌రౌండర్ గ్లేన్ ఫిలిప్స్‌ను రంగంలోకి దించే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ ఆడలేదు.ఒకవేళ ఎక్స్‌ట్రా పేసర్ కావాలనుకుంటే మాత్రం మార్కో జాన్సెన్ బరిలోకి దిగుతాడు. తుది జట్టులో మార్పులు చేయాలనుకుంటే విజయకాంత్ వియాస్కాంత్‌పై వేటు పడుతుంది. ఉనాద్కత్‌ను జట్టులోకి తీసుకుంటే సన్వీర్ సింగ్ ఉద్వాసనకు గురవుతాడు. లేదంటే విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగించే అవకాశం ఉంది.