టీం మిండియాలో ఫిట్‌నెస్ అంటేనే గుర్తుకువచ్చే విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యాలను తలదన్ని ప్రస్తుత జట్టులో అందరికంటే ఫిట్‌గా ఉన్న క్రికెటర్‌గా స్టార్ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ గుర్తింపు దక్కించుకున్నాడు. ఆసియా కప్ నేపథ్యంలో బీసీసీఐ ఇటీవలే నిర్వహించిన యో యో టెస్టులో గిల్.. ఏకంగా 18.7 స్కోరు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడని బోర్డు వర్గాల ద్వారా తెలుస్తున్నది. టీమిండియాలో ఆరేండ్ల క్రితం ఈ యో యో టెస్టును తీసుకురాగా ఇప్పటివరకూ ఈ పరీక్షలో అత్యుత్తమంగా రాణించినవారంటే కచ్చితంగా కోహ్లీ, పాండ్యాలు ముందువరుసలో ఉంటారు.
దేహదారుఢ్యం విషయంలో ఈ ఇద్దరూ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. అయితే బీసీసీఐ తాజాగా నిర్వహించిన యో యో టెస్టులో కోహ్లీ.. 17.2 స్కోరు సాధించాడు. గిల్.. కోహ్లీని దాటడం విశేషం. యో యో టెస్టు పాస్ అవ్వాలంటే మినిమం 16.5 పాయింట్స్ స్కోరు చేయాల్సి ఉంటుంది. ఆసియా జట్టుకు ఎంపికైన వారిలో అందరూ 16.5 నుంచి 18 మధ్యలో స్కోరు చేశారని పీటీఐ వెల్లడించింది. ఇందులో ఐర్లాండ్ పర్యటనలో ఉన్న బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, సంజూ శాంసన్, తిలక్ వర్మతో పాటు కెఎల్ రాహుల్ ఈ టెస్టులో పాల్గొనలేదు. ఈ టెస్టుతో తన ఫిట్నెస్ లెవెల్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ఈ రైట్ హ్యాండ్ బ్యాట్సమెన్ రుజువుచేసాడు.