Steve Smith: 99 మ్యాచుల్లోనే 9 వేల పరుగులు పూర్తి.. సచిన్, సంగక్కర, లారా, ద్రావిడ్ రికార్డులు బ్రేక్

అతి తక్కువ టెస్టుల్లో తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు స్టీవ్ స్మిత్. లార్డ్స్‌లో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌పై 31 పరుగులు చేసిన తర్వాత స్మిత్ ఈ రికార్డు అందుకున్నాడు.

  • Written By:
  • Publish Date - June 29, 2023 / 02:47 PM IST

Steve Smith: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ టెస్టు క్రికెట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అతి తక్కువ టెస్టుల్లో తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. లార్డ్స్‌లో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌పై 31 పరుగులు చేసిన తర్వాత స్మిత్ ఈ రికార్డు అందుకున్నాడు.

తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్ 149 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 85 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తన అద్భుత బ్యాటింగ్‌తో స్మిత్ మరోసారి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. కెరీర్‌లో 99 టెస్టు మ్యాచులు, 174 ఇన్నింగ్సుల్లో స్టీవ్ స్మిత్ 9 వేల పరుగులు పూర్తి చేశాడు. అతి తక్కువ టెస్టుల్లో ఈ మైలురాయిని సాధించిన తొలి ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా పేరిట ఉంది. లారా 101 టెస్టు మ్యాచ్‌ల్లో 9000 పరుగులు పూర్తి చేశాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర 9000 పరుగులు పూర్తి చేసేందుకు 172 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ 111 టెస్టుల్లో 9000 పరుగులు పూర్తి చేయగా.. ది వాల్ రాహుల్ ద్రవిడ్ 104 మ్యాచ్‌ల్లో ఈ మైలురాయి అందుకున్నాడు.

ఇక ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 177 ఇన్నింగ్స్‌ల్లో 9 వేల పరుగులు పూర్తి చేశాడు. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌లో 15 వేల పరుగులను 351 ఇన్నింగ్స్‌ లో స్టీవ్ స్మిత్ పూర్తి చేశాడు. అత్యంత వేగంగా 15 వేల పరుగులు చేసిన 7వ ఆటగాడిగా స్మిత్ నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ 333 ఇన్నింగ్స్‌ల్లో 15 వేల పరుగులు పూర్తి చేశాడు. దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ అషిమ్ ఆమ్లా 336 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ 344 ఇన్నింగ్స్‌లలో, ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ 347 ఇన్నింగ్స్‌లలో, కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 348 ఇన్నింగ్స్‌ల్లో, ఇంగ్లీష్ బ్యాటర్ జో రూట్ 350 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించారు.