సొంతగడ్డపై బంగ్లాదేశ్ తో జరగనున్న మూడు టీ ట్వంటీల సిరీస్ కోసం త్వరలోనే బీసీసీఐ సెలక్టర్లు టీమ్ ను ఎంపిక చేయనున్నారు. ఇకపై వరుస సిరీస్ లు ఉండడంతో పలువురు సీనియర్లకు రెస్ట్ ఇచ్చి యువ క్రికెటర్లను సెలక్ట్ చేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ టీ ట్వంటీ జట్టులోకి మళ్ళీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇటీవల జింబాబ్వేతో సిరీస్ కు తొలిసారిగా ఎంపికైన అభిషేక్ శర్మ మొదటి మ్యాచ్ లో డకౌటై నిరాశపరిచాడు. అయితే రెండో మ్యాచ్ లో శతకంతో దుమ్మురేపాడు. కేవలం 47 బంతుల్లోనే 7 ఫోర్లు, 8 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. అభిషేక్ శర్మ హిట్టింగ్ పవర్ ప్లేలో జట్టుకు చాలా కీలకంగా ఉంటుందని చెప్పొచ్చు. ప్రస్తుతం బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న శుభమన్ గిల్, యశస్వి జైశ్వాల్ మళ్ళీ కివీస్ తో టెస్ట్ సిరీస్ లోనూ బరిలోకి దిగుతారు.
తర్వాత ఆసీస్ టూర్ ఉండడంతో టీ ట్వంటీలకు వారిని దూరం పెడితే మంచిదని గంభీర్ భావిస్తున్నాడు. గిల్, జైశ్వాల్ ఇద్దరికీ రెస్ట్ ఇస్తే అభిషేక్ నే ఎంపిక చేస్తారని తెలుస్తోంది. అలాగే రుతురాజ్ గైక్వాడ్ , సంజూ శాంసన్ లు కూడా సెలక్టర్ల పిలుపు దక్కించుకునే అవకాశముంది. ఇరానీ కప్ కు ఎంపికైన రుతురాజ్ తొలి టీ ట్వంటీకి అందుబాటులో ఉండడంపై సందిగ్ధత నెలకొంది. అటు వికెట్ కీపర్లుగా ఇషాన్ కిషన్ తో పాటు సంజూకు కూడా చోటు దక్కుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే బౌలింగ్ విభాగంలోనూ పలువురు యువ ఆటగాళ్ళకు చోటు దక్కనుంది. కాగా బంగ్లాదేశ్ తో మూడు టీ ట్వంటీల సిరీస్ అక్టోబర్ 6 నుంచి మొదలుకానుంది.