ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. సమష్టి ప్రదర్శనతోనే ఈ విజయం సాధించామని హార్దిక్ పాండ్యా తెలిపాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్.. కుర్రాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘ఇది ప్రత్యేకమైన విజయం. నిజాయితీగా చెప్పాలంటే ఓ కెప్టెన్‌గా ఇలాంటి మ్యాచ్‌ల కోసం ఎదురు చూస్తున్నాను. ఇలాంటి డూఆర్‌డై మ్యాచ్‌లు అంతర్జాతీయ స్థాయి కంటే ఎక్కువ. ఈ మ్యాచ్‌కు ముందు విరాట్‌తో మాట్లాడాను. అనుభవంతో అతను ఇచ్చిన సలహా నాకు బాగా ఉపయోగపడింది. మిడిల్‌లో కాస్త టైమ్ తీసుకొని ఆడాలని విరాట్ సూచించాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌కు అలవాటు పడాలని కోరాడు. కోహ్లీ తన అనుభవాన్ని నాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు.
ఒక బంతిని హిట్ చేసి రిథమ్ అందుకుంటే పరిస్థితులన్నీ చాలా భిన్నంగా ఉంటాయి. పవర్ ప్లేలోనే గేమ్ దాదాపు ముగిసింది. కానీ టెయిలెండర్స్ పోరాడారు. మేం ఆడిన మైదానాల్లో ఇది అద్భుతమైనది. మరోసారి వెస్టిండీస్ పర్యటనకు వచ్చినప్పుడు పరిస్థితులన్నీ చక్కబడుతాయని ఆశిస్తున్నా. ప్రయాణం వంటి విషయాల్లో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మాకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటుందని అనుకుంటున్నా అని హార్దిక్ తెలిపాడు. టీమిండియా వీరోచిత బ్యాటింగ్ తో, ఇప్పుడు వరల్డ్ కప్ సెలెక్షన్స్ విషయంలో ఎవరిని తీసుకోవాలో ఎవరిని పక్కన పెట్టాలో డైలమాలో పడినట్లయింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 351 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(64 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 77), శుభ్‌మన్ గిల్(92 బంతుల్లో 11 ఫోర్లతో 85), సంజూ శాంసన్(41 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51), హార్దిక్ పాండ్యా(52 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 70 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.