క్రికెట్ లో 2024 భారత జట్టుకు చిరస్మరణీయమనే చెప్పాలి… గత ఏడాదితో పోలిస్తే ఈ సారి కొన్ని అద్భుత విజయాలు మన సొంతమయ్యాయి. ముఖ్యంగా టీ ట్వంటీ క్రికెట్ లో రెండోసారి మన జట్టు విశ్వవిజేతగా నిలిచింది. వరల్డ్ కప్ విక్టరీతో రాహుల్ ద్రావిడ్ కోచ్ గా తన బాధ్యతలకు ఘనంగా వీడ్కోలు పలికితే… కొత్త కోచ్ గా గంభీర్ పగ్గాలు అందుకున్నాడు. స్వదేశంలో కివీస్ చేతిలో ఓటమి బాధించినా… బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పెర్త్ విజయం మంచి కిక్ ఇచ్చింది… భారత క్రికెట్ కు సంబంధించి ఈ ఏడాది చోటు చేసుకున్న పలు కీలక పరిణామాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం…
2024లో భారత క్రికెట్ అతిపెద్ద విక్టరీ టీ ట్వంటీ ప్రపంచ కప్పే….అమెరికా, విండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఈ మెగా టోర్నీలో భారత్ ఛాంపియన్ గా నిలిచింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ కు దూసుకొచ్చి టైటిల్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా టైటిల్ పోరులో దాదాపు ఓటమి ఖాయమనుకున్న వేళ చివర్లో హార్థిక్ పాండ్యా, బూమ్రా అద్భుతమైన బౌలింగ్ కు… బౌండరీ లైన్ దగ్గర సూర్యకుమార్ యాదవ్ కళ్ళుచెదిరే ఫీల్డింగ్ తో అందుకున్న క్యాచ్ మనకు ప్రపంచకప్ ను అందించాయి. దీంతో రోహిత్ శర్మ నాయకత్వంలో 17 ఏళ్ల తర్వాత భారత్ రెండో సారి టీ20 ప్రపంచకప్‌ను గెలిచింది. జూన్ 29న భారత క్రికెట్ చరిత్రలో ఓ ప్రత్యేక రోజుగా మిగిలిపోయింది. టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ అనంతరం పొట్టి ఫార్మాట్‌కు కెప్టెన్ రోహిత్, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి రిటైర్‌మెంట్ ప్రకటించారు.
ఓవరాల్ గా ఈ ఏడాది టీ ట్వంటీల్లో టీమిండియానే తోపు… ప్రపంచకప్ కాకుండా ఈ ఏడాది భారత్ 18 టీ20 మ్యాచ్‌లు ఆడింది. అఫ్గానిస్థాన్ 3-0, జింబాబ్వే 4-1, శ్రీలంక 3-0, బంగ్లాదేశ్ 3-0, దక్షిణాఫ్రికా పై 3-1తో ఓడించింది. అటు ఈ ఏడాది ర్యాంకింగ్స్‌లోనూ భారత్ హవా కొనసాగించింది. వన్డే, టీ20, టెస్టుల్లో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి పడిపోయినా, మిగతా రెండు ఫార్మాట్లలో నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. పురుషుల బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లోనూ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. టీ20 క్రికెటర్లలో ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా నంబర్ వన్. టెస్టు ర్యాంకింగ్స్‌లో యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ కెరీర్ అత్యుత్తమ ర్యాంకులను చేరుకున్నారు.
కాగా టీ20 ప్రపంచకప్‌తో ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. కొత్త కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలను అందుకున్నాడు. ఈ ఏడాది ఒకే ఒక్క వన్డే సిరీస్ ఆడిన భారత్.. అందులో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను శ్రీలంక 2-0తో కైవసం చేసుకుంది. తొలి వన్డేను డ్రా చేసుకున్న భారత్ రెండో వన్డేలో 32 పరుగుల తేడాతోనూ, మూడో వన్డేలో 110 పరుగుల తేడాతోనూ ఓడిపోయింది.
అటు టెస్ట్ ఫార్మాట్ లో టీమిండియాకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. 2024లో భారత జట్టు మొత్తం 13 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ను భారత్ 4-1తో కైవసం చేసుకుంది. ఆ తరువాత బంగ్లాదేశ్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అయితే.. అక్టోబర్-నవంబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో భారత్‌కు చేదు అనుభవం ఎదురైంది. 0-3 తేడాతో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమితో భారత్‌కు డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి.
ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతోంది. ఐదు టెస్టుల సిరీస్ లో తొలి మ్యాచ్ లో భారత్ గెలిస్తే… తర్వాత పుంజుకున్న ఆసీస్ అడిలైడ్ లో విజయం సాధించి సిరీస్ ను సమం చేసింది. ఈ ఏడాది భారత్ మరో రెండు టెస్టులు ఆడనుండగా…ఐదో మ్యాచ్ కొత్త సంవత్సరంలో జరగనుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 4-1తో గెలిస్తే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరుకుంటుంది. మొత్తం మీద టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయం 2024లో భారత్ క్రికెట్ ఫ్యాన్స్ కు మంచి కిక్కు ఇచ్చింది. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఇంగ్లాండ్ లో టెస్ట్ సిరీస్ రూపంలో టీమిండియాకు సవాళ్ళు ఎదురుకాబోతున్నాయి.