భారత్,బంగ్లాదేశ్ రెండో టీ ట్వంటీకి కౌంట్ డౌన్ మొదలైంది. బుధవారం న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్ లో బంగ్లాను చిత్తు చేసిన సూర్యా గ్యాంగ్ ఇప్పుడు సిరీస్ విజయమే టార్గెట్ గా బరిలోకి దిగుతోంది. గ్వాలియర్ మ్యాచ్ లో టీమిండియా కంప్లీట్ గా డామినేట్ చేసింది. మొదట బౌలింగ్ తో బంగ్లాను బెంబేలెత్తించి తర్వాత బ్యాట్ తో అదరగొట్టి విజయాన్ని అందుకుంది. ఇదే జోరు కొనసాగించి ఢిల్లీలోనే సిరీస్ కైవసం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది. బ్యాటింగ్ లో ఓపెనర్లు సంజూ శాంసన్ , అభిషేక్ శర్మ ఈ సారి పెద్ద ఇన్నింగ్స్ లు ఆడాలని మేనేజ్ మెంట్ కోరుకుంటోంది. అలాగే హార్థిక్ పాండ్యా, రియాన్ పరాగ్ , సూర్యకుమార్ మెరుపులు మెరిపిస్తే భారీస్కోరు ఖాయమని చెప్పొచ్చు. ఫినిషర్ గా రింకూ సింగ్ , తుది జట్టులో మార్పులు చేయకుంటే నితీశ్ కుమార్ రెడ్డికి ఈ మ్యాచ్ మరో అవకాశంగా చెప్పొచ్చు.
మరోవైపు బౌలింగ్ లో అర్షదీప్ సింగ్ పేస్ ఎటాక్ ను లీడ్ చేయనున్నాడు. అతనితో పాటు మయాంక్ యాదవ్ కు తుది జట్టులో చోటు ఖాయం. గత మ్యాచ్ తో అరంగేట్రం చేసిన మయాంక్ అంచనాలకు తగ్గట్టే రాణించాడు. 147 కి.మీ వేగంతో బౌలింగ్ చేసిన మయాంక్ ఒక వికెట్ కూడా తీశాడు. తొలి ఓవర్ నే మెయిడెన్ వేసిన మయాంక్ యాదవ్ ను కొనసాగించేందుకే మేనేజ్ మెంట్ మొగ్గుచూపుతోంది. స్పిన్ విభాగంలో వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి కొనసాగే అవకాశముంది. గత మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లతో తన స్పిన్ మ్యాజిక్ చూపించాడు. ఒకవేళ హర్షిత్ రాణాను తుది జట్టులోకి తీసుకుంటే మాత్రం ఎవరిని తప్పిస్తారనేది చూడాలి. విన్నింగ్ కాంబినేషన్ నే కొనసాగించేందుకు కోచ్ గౌతమ్ గంభీర్ మొగ్గుచూపే అవకాశముంది. సిరీస్ కైవసం చేసుకుంటే… హైదరాబాద్ వేదికగా జరిగే చివరి మ్యాచ్ లో రిజర్వ్ బెంచ్ ప్లేయర్స్ ను ఆడించే ఛాన్సుంది. దీంతో శివమ్ దూబే స్థానంలో ఎంపికైన తిలక్ వర్మకు నిరాశ తప్పకపోవచ్చు. అలాగే స్పిన్నర్ రవిబిష్ణోయ్ కూడా బెంచ్ కే పరిమితం కావాల్సి ఉంటుంది.
మరోవైపు సిరీస్ చేజారకుండా ఉండాలంటే బంగ్లాదేశ్ ఈ మ్యాచ్ లో గెలిచి తీరాలి. గత మ్యాచ్ లో ఏమాత్రం పోటీనివ్వలేకపోయిన ఆ జట్టు భారత్ ను నిలువరించాలంటే అంచనాలకు మించి రాణించాల్సిందే..ఇదిలా ఉంటే అరుణ్ జైట్లీ స్టేడియం బ్యాటర్లకు అనుకూలిస్తుందని అంచనా వేస్తున్నారు. గత రికార్డులు ప్రకారం చూస్తే ఛేజింగ్ చేసిన జట్లే ఎక్కువసార్లు గెలిచాయి. ఇప్పటి వరకూ ఇక్కడ 13 మ్యాచ్ లు జరిగితే ఛేజింగ్ టీమ్స్ 9 సార్లు విజయం సాధించగా.. మొదటి బ్యాటింగ్ చేసిన జట్లు నాలుగు సార్లే గెలిచాయి. ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ లు జరిగినప్పుడు ఇక్కడ పరుగుల వరద పారింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇదే పిచ్ పై 266 పరుగుల భారీస్కోర్ చేయగా…ఇక్కడ 212 పరుగుల టార్గెట్ ను ఛేదించిన రికార్డుంది.