శ్రీలంకతో టీ ట్వంటీ సిరీస్ కోసం టీమిండియా రెడీ అవుతోంది. కొత్త కోచ్ గంభీర్, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కొత్త శకం మొదలవుతుందనే చెప్పాలి. ప్రస్తుతం ప్రాక్టీస్ లో బిజీగా ఉన్న భారత క్రికెటర్లకు కోచ్ గంభీర్ తొలిరోజు నుంచే కీలక సూచనలు ఇస్తూ కనిపించాడు. ఈ సెషన్‌లో గౌతీ ప్రతి ఒక్క ఆటగాడితో ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. వారి లోపాలను సరి చేసే ప్రయత్నం చేశాడు. టీ20 ఫార్మాట్ అంటేనే దూకుడుగా ఆడాలని, ఎవరూ కూడా డిఫెన్స్ ఆడొద్దు అని ప్లేయర్లకు గంభీర్ చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే దూకుడుగా ఆడిన పిచ్చి షాట్లు మాత్రం ఆడొద్దని సూచించాడు.
ఇదిలా ఉంటే గంభీర్ బాధ్యతలు చేపట్టినట్లుగా బీసీసీఐ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ద్వారా గంభీర్ ప్రత్యేకంగా సంజూ శాంసన్‌తో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. బ్యాటింగ్‌కు సంబంధించి కొన్ని చిట్కాలను సంజూకు గంభీర్ చెప్పారు. వాస్తవానికి సంజూ శాంసన్‌లో టాలెంట్‌లో ఎలాంటి కొదవ లేదు. అయితే.. నిలకడ లేకపోవడమే అతడి బలహీనత. ఈ క్రమంలోనే సంజూ బ్యాటింగ్ పై గంభీర్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లుగా అర్థమవుతోంది. ఎక్కువ సేపు క్రీజులో ఉండాలని అతడికి సూచించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ లో సంజూను ప్రోత్సహించింది గంభీరే. దీంతో తన శిష్యుడుపై మరింత దృష్టి పెట్టినట్టు అర్థమవుతోంది.