2023 ఐపీఎల్‌లో అదరగొట్టి, ఇటీవల వెస్టిండీస్ టెస్ట్‌లో సంచలన ప్రదర్శన చేసిన జైస్వాల్‌కి వరల్డ్ కప్ ఆడే అవకాశం లభిస్తుందా? లేదా? అని క్రికెట్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఇండియా ఆతిథ్యమిస్తున్న వరల్డ్ కప్ ఇంకో రెండు నెలల్లో ప్రారంభం కాబోతోంది. మెగా ఈవెంట్‌కి సమయం సమీపిస్తున్న కొద్దీ క్రికెట్ ఫీవర్ పెరుగుతోంది. టోర్నీలో తలపడనున్న మొత్తం పది జట్లు సన్నాహాలు మొదలుపెట్టేశాయి. ఫేవరెట్, ఆతిథ్య భారత్ ఐసీసీ టోర్నీ గండాన్ని దాటి కప్ నెగ్గాలని భావిస్తోంది. అయితే ఇండియాకు ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ జోడీ సరిగ్గా సరిపోతుందని చాలా మంది భావించారు. ఇప్పుడు యువ సంచలనం యశస్వి జైస్వాల్, తన పరుగుల వరదతో ఫోకస్‌లోకి వచ్చాడు. సెలక్టర్లకు తానూ బెస్ట్ ఓపెనింగ్ ఆప్షన్ అని నిరూపించాడు.
IPL 2023 సీజన్‌లో తన ప్రదర్శనతో యశస్వి జైస్వాల్ ఆకట్టుకున్నాడు. అప్పుడే క్రికెట్ ప్రపంచం అతన్ని గమనించింది. ఐపీఎల్‌లో జైస్వాల్ ఇన్‌క్రెడిబుల్ ఇన్నింగ్స్‌లు అతడికి తొలి అవకాశాన్ని తీసుకొచ్చాయి. వెస్టిండీస్ పర్యటనకు సెలక్ట్ అయ్యేలా చేశాయి.అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న జైస్వాల్, రోహిత్‌లో కలిసి బెస్ట్ పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పాడు. ఏకంగా 171 పరుగులతో ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదటి మ్యాచ్‌లోనే మెచ్యూరిటీ, బ్యాలెన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. తన ప్రతిభతో అభిమానులను, విమర్శకులను కట్టిపడేశాడు. ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సైతం, టెలిగ్రాఫ్‌తో మాట్లాడుతూ ఈ యువ ఆటగాడిని ప్రశంసించాడు. జైస్వాల్ మొదటి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ బాదడం ఎంత స్పెషలో గంగూలీకి తెలియంది కాదు. టెస్టుల్లోకి గంగూలీ కూడా సెంచరీతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. జైస్వాల్ టెక్నిక్‌ని అతడు మెచ్చుకున్నాడు.
ఇండియన్ టాప్-ఆర్డర్ లైనప్‌కు డైవర్సిటీ, డెప్త్ కోసం లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్ అవసరమని అభిప్రాయపడ్డాడు. ఓ రకంగా 2023 వరల్డ్ కప్ ఇండియన్ టీమ్‌లో జైస్వాల్ ఉండాలని కెప్టెన్ రోహిత్, ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్‌కి మెసేజ్ పంపాడు. అనుభవజ్ఞులు, క్రికెట్ విశ్లేషకుల నుంచి సపోర్ట్ ఉన్నప్పటికీ.. వెస్టిండీస్ పర్యటనలో వన్డే సిరీస్ నుంచి యశస్వి జైస్వాల్‌ని పక్కనపెట్టడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నిర్ణయం తీవ్రమైన చర్చలకు దారితీసింది. అయితే ఇందుకు బదులు జైస్వాల్‌ను ఆసియా గేమ్స్ స్క్వాడ్‌కు సెలక్ట్ చేశారు. సాధారణంగా ప్రపంచ కప్‌కి సెలక్ట్ అయ్యే అవకాశం లేని వ్యక్తుల పేర్లు ఈ లిస్ట్‌లో కనిపిస్తాయి. దీంతో ఈ యంగ్ బ్యాటర్ వరల్డ్‌కప్‌లో ఆడతాడా లేదా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.