Sanju Samson: సంజూ సహనాన్ని జోక్ చేయొద్దు

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. యువ ప్లేయర్లు టీమిండియాలో చోటు కోసం సిద్దం అయ్యారు. అయితే వీరికి ఛాన్స్ వన్డే ప్రపంచకప్ తర్వాతే ఉంటుంది.

  • Written By:
  • Publish Date - July 29, 2023 / 04:45 PM IST

ప్లేయర్ల ఎంపిక విషయంలో టీమిండియా మేనేజ్ మెంట్ చాలా వింతగా ప్రవర్తిస్తుంది. ఒక పక్క ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూనే.. మరో పక్క అదే ట్యాలెంట్ కు పుచ్చు పట్టేలా చేస్తుంది. సంజూ సామ్సన్ విషయంలో టీమిండియా మేనేజ్ మెంట్ వ్యవహార శైలి అనేక ప్రశ్నలకు తావిచ్చేలా ఉంది. నిలకడగా రాణిస్తున్నా అతడికి తుది జట్టులో ఛాన్స్ దక్కడం లేదు. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ ల కారణంగా గతంలో అతడికి చోటు దక్కలేదు. ఇప్పుడు ఇషాన్ కిషన్ కారణంగా అతడికి ప్లేయింగ్ ఎలెవెన్ లో ఛాన్స్ ఉండటం లేదు. సంజూ సామ్సన్ మంచి వికెట్ కీపర్. బ్యాటింగ్ ఆర్డర్ లో ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు. అయినా అతడికి ప్లేయింగ్ ఎలెవెన్ లో చోటు ఇవ్వడం లేదు.

తాజాగా ముగిసిన తొలి వన్డేలో కూడా అతడికి నిరాశే ఎదురైంది. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ ల కంటే కూడా సంజూ సామ్సన్ వన్డే సగటు అద్భుతంగా ఉంది. అయినా అతడికి ఎందుకు ఛాన్స్ ఇవ్వడం లేదో అర్థం కాని పరిస్థితి. సంజూ సామ్సన్ 11 వన్డేల్లో 330 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. సగటు 66. స్ట్రయిక్ రేట్ 104.8. మిడిలార్డర్ లో భాగస్వామ్యాలు నెలకొల్పడంతో పాటు చివర్లో హిట్టింగ్ చేసే సత్తా ఉన్న ప్లేయర్ సంజూ.

సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో 24 మ్యాచ్ లు ఆడి కేవలం 452 పరుగులు మాత్రమే చేశాడు. రెండు అర్ధ సెంచరీలు ఉండగా.. సగటు కేవలం 23.78. ఇక ఇషాన్ కిషన్ 15 వన్డేల్లో 562 పరుగులు చేశాడు. సగటు 43.23. ఇక కేఎల్ రాహుల్ విషయానికి వస్తే 52 వన్డేల్లో 1,986 పరుగులు చేశాడు. 5 సెంచరీలు.. 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. సగటు 45.13. స్ట్రయిక్ రేట్ 86.57. ఏ లెక్కన చూసుకున్నా సూర్యకుమార్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ ల కంటే సంజూ సామ్సన్ మెరుగైన బ్యాటర్. అయినా అతడికి ప్లేయింగ్ ఎలెవెన్ లో మాత్రం చోటు దక్కడం లేదు అని అభిమానులతో పాటు కొందరు మాజీ క్రికెటర్లు కూడా బీసీసీఐ మీద మండిపడుతున్నారు.