వరుసగా మూడు వన్డేల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించిన ఇషాన్ కిషన్.. ఎంఎస్ ధోనీ, అజారుద్దీన్, దిలీప్ వెంగ్‌సర్కార్, శ్రేయస్ అయ్యర్, క్రిస్ శ్రీకాంత్, సరసన చేరాడు. మూడు మ్యాచ్‌ల సిరీసుల్లో వరుసగా హాఫ్ సెంచరీలు సాధించిన జాబితాలో ఆరో బ్యాటర్‌గా ఇషాన్ రికార్డు సృష్టించాడు. ఒక జట్టుపై అత్యధిక వన్డే సిరీస్‌లను నెగ్గిన జట్టుగానూ భారత్ అవతరించింది. వెస్టిండీస్‌పై 13 సిరీస్‌లను గెలిచింది. అంతకుముందు శ్రీలంకపై భారత్ 10 సిరీస్‌లను కైవసం చేసుకుంది.
ఇషాన్ కిషన్ – శుభ్‌మన్ గిల్ తొలి వికెట్‌కు 143 పరుగులు జోడించారు. విండీస్‌లో భారత్‌కు ఇదే అత్యధిక పార్టనర్‌షిప్ కావడం విశేషం. ఇంతకుముందు శిఖర్ ధావన్ – అజింక్య రహానె 132 పరుగులు జోడించారు. వ్యక్తిగత స్కోరు సెంచరీ లేకుండానే భారత్ జట్టు 350+ స్కోరు చేయడం ఇది రెండోసారి. ఇప్పుడు 351 స్కోరు చేసిన భారత్.. 2005లో నాగ్‌పుర్ వేదికగా 350 స్కోరు చేసింది.