Rohit Sharma: మిడిల్ ఆర్డర్‌లో రోహిత్.. ఓపెనర్లు వాళ్లేనా..?

మొదట్లో కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ కలిసి ప్రాక్టీస్ చేశారు. అనంతరం కోహ్లీ-శ్రేయస్ జోడీ బ్యాటింగ్ చేయగా, టీమ్ మేనేజ్‌మెంట్ ఈ జోడీల్లో మార్పులు చేస్తోంది. మరో సెషన్‌లో రోహిత్- శ్రేయస్ అయ్యర్ మొదట బ్యాటింగ్ ప్రారంభించారు.

  • Written By:
  • Publish Date - August 30, 2023 / 06:27 PM IST

Rohit Sharma: పాకిస్థాన్, శ్రీలంక వేదికగా ఆసియా కప్-2023 టోర్నమెంట్ నేటి నుంచి జరగనుంది. అయితే తుది జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌పై టీమిండియా మేనేజ్‌మెంట్ ఇప్పటికీ ఓ అంచనాకు రాలేకపోతుంది. ఓపెనర్స్ జోడీ, మూడు, నాలుగు స్థానాల్లో ఎవరిని దింపాలన్న దానిపై ఇంకా కన్ఫ్యూషన్‌లో కొట్టుమిట్టాడుతోంది. ట్రైనింగ్ క్యాంప్‌లో బ్లూ జెర్సీ ఆటగాళ్లు జోడీలుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. మొదట్లో కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ కలిసి ప్రాక్టీస్ చేశారు. అనంతరం కోహ్లీ-శ్రేయస్ జోడీ బ్యాటింగ్ చేయగా, టీమ్ మేనేజ్‌మెంట్ ఈ జోడీల్లో మార్పులు చేస్తోంది.

మరో సెషన్‌లో రోహిత్- శ్రేయస్ అయ్యర్ మొదట బ్యాటింగ్ ప్రారంభించారు. దీంతో ఒపెనర్‌గా రోహిత్‌తో శ్రేయస్ రావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో శ్రేయస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అయితే దీనికి మరో వాదన వినిపిస్తోంది. ఓపెనర్‌గా రోహిత్‌కు జోడీగా గిల్, ఇషాన్ కిషన్, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. రోహిత్, గిల్ ఓపెనర్స్‌గా బరిలోకి దిగితే ఇషాన్ కిషన్ వన్‌డౌన్‌లో రావచ్చు. విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో బరిలోకి దిగవచ్చు. ఐదో స్థానం కోసం శ్రేయస్, సూర్య మధ్య పోటీ ఉంటుంది. వీరిలో ఎవరిని ఆడించాలి..? ఎవర్ని పక్కన పెట్టాలి అనే దానిపై ఓ కొలిక్కిరావడం టీమ్ మేనేజ్‌మెంట్‌కు అంత ఈజీ కాదు. యువరాజ్ రిటైర్మెంట్ తరువాత నాలుగో స్థానం కోసం టీమిండియాకు ఇప్పటికీ సరైన ఆటగాడు దొరకలేదు.

శ్రేయస్ ఈ స్థానానికి సరిగ్గా సెట్ అవుతాడని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే అతను తరచుగా గాయాల బారిన పడుతుండటంతో ఇతర ఆటగాళ్లపై టీమ్ ఆధారపడుతోంది. ఓపెనర్స్‌గా గిల్-ఇషాన్‌ జోడీ బరిలోకి దిగే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మకు గతంలో మిడిలార్డర్‌లో ఆడిన అనుభవం ఉంది. దీంతో అతన్ని ఐదో స్థానంలో ఆడించే అవకాశం లేకపోలేదు. కోహ్లీ మూడో స్థానంలో బరిలో ఉంటాడు. ఇక నాలుగో స్థానం కోసం శ్రేయస్, సూర్యలో ఎవరినో ఒకరిని ఆడించే అవకాశం ఉంది.