Team India: గుండెల మీద ఇండియా పేరేది.. బీసీసీఐ పుంగిబజాయిస్తున్న ఫ్యాన్స్

వెస్టిండీస్‌తో బుధవారం నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టుకు ముందు భారత క్రికెట్‌ జట్టు కొత్త జెర్సీని ఆవిష్కరించింది. డ్రీమ్‌ ఎలెవన్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ఈ కొత్త జెర్సీతో మంగళవారం భారత జట్టు ఫొటో షూట్‌ నిర్వహించింది.

  • Written By:
  • Publish Date - July 12, 2023 / 06:54 PM IST

ఈ ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకోగా.. విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కాసుల కోసం కక్కుర్తి పడి.. జాతీయ జట్టు జెర్సీని ఫ్రాంచైజీ కలర్‌లోకి మార్చేశారనే మాటలు వినిపిస్తున్నాయి. సుదీర్ఘ ఫార్మాట్‌లో సాధారణంగా తెలుపు రంగుల దుస్తులు మాత్రమే వాడుతారు. అయితే గత కొన్నాళ్లుగా వీటిపై కూడా నంబర్లతో పాటు పేర్లు వేసుకునేందుకు ఐసీసీ అనుమతించింది. అయినా మన జట్టు పెద్దగా ప్రయోగాల జోలికి పోకుండా.. సింపుల్‌ వైట్‌తోనే జెర్సీలు రూపొందించింది. అవి ఎంతగానో ఆకట్టుకున్నాయి కూడా. అయితే వెస్టిండీస్‌తో పర్యటన కోసం రూపొందించిన జెర్సీలు మాత్రం మరీ విచిత్రంగా కనిపిస్తున్నాయి. దీంతో అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.

ముందు భాగంలో ఎర్ర అక్షరాలతో ‘డ్రీమ్‌ ఎలెవన్‌’ అని పెద్దగా ముద్రించడం భారీ విమర్శలకు తావిస్తోంది. బీసీసీఐ లోగో కన్నా ఇదే హైలైట్‌ అవుతుండగా.. భుజాలపై బ్లూ కలర్‌లో మూడు గీతలు కూడా ఎబ్బెట్టుగా కనిపిస్తున్నాయి. దీనిపై సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు నవ్వులు పూయిస్తున్నాయి.‘వరస్ట్‌ కలర్‌ కాంబినేషన్‌’ అని ఓ నెటిజన్‌ అభిప్రాయపడగా.. ‘ఇంతకన్నా మెరుగైన జెర్సీలు ఎన్నో ఉంటాయి.. మీకు ఇదే నచ్చిందా’ అని మరొకరు కామెంట్‌ చేశారు. ‘ఇదేదో డ్రీమ్‌ ఎలెవన్‌ అనే దేశానికి సంబంధించిన జెర్సీలా ఉంది’ అని మరొకరు ట్వీట్‌ చేశారు.

ఇటీవల ఆస్ట్రేలియాతో జరగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత ఆటగాళ్లు వేసుకున్న జెర్సీ దీనికన్నా చాలా మెరుగ్గా ఉందని.. పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ‘అసలు ఇది టెస్టు జెర్సీనేనా.. డబ్బుల కోసం మరీ ఇంత కక్కుర్తి పడాలా.. దేశ లోగో కన్నా స్పాన్సర్‌ పేరు పెద్దగా ఉందంటే సంభావన గట్టిగానే ముట్టినట్లు ఉంది’ అని ఓ నెటిజన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ లో కామెంట్‌ చేశాడు. డ్రీమ్‌ ఎలెవన్‌ ప్లేయింగ్‌ ఎలవెన్‌ అంటూ పలువురు చమత్కరిస్తున్నారు. మరీ భారత టెస్టు కొత్త జెర్సీ మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి.