టీమిండియా (Team India) స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా (Jaspreet Bumrah) చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ (Test Cricket) లో అత్యంత వేగంగా 150 వికెట్ల మైలురాయి అందుకున్న భారత బౌలర్ (Indian bowler) గా, రెండో ఆసియా ప్లేయర్‌గా రికార్డు సాధించాడు. విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో నిప్పులు చెరిగిన బుమ్రా.. 6 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ వికెట్ తీయడం ద్వారా 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. 34 టెస్ట్‌ల్లో 150 వికెట్లు పడగొట్టి అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన తొలి భారత బౌలర్‌గా.. రెండో ఆసియా క్రికెటర్ (Asian Cricketer) గా నిలిచాడు. పాకిస్థాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ 27 మ్యాచ్‌ల్లో 150 వికెట్లు పడగొట్టి బుమ్రా కన్నా ముందున్నాడు. బుమ్రా తర్వాత ఇమ్రాన్ ఖాన్ 37, షోయబ్ అక్తర్ 37 మ్యాచ్‌ల్లో 150 వికెట్ల మైలురాయి అందుకున్నారు.
ఇదిలా ఉంటే 150 వికెట్లు పడగొట్టేందుకు బుమ్రా మొత్తం 6781 బంతులు వేసాడు. బుమ్రా తర్వాత ఉమేశ్ యాదవ్ (Umesh Yadav) 7661, మహమ్మద్ షమీ (Mohammed Shami) 7755, కపిల్ దేవ్ 8378, అశ్విన్ 8380 బంతులేసి ఈ ఫీట్ సాధించారు. కాగా టెస్ట్‌ల్లో ఐదు వికెట్ల ఘనత అందుకోవడం బుమ్రాకు 10వసారి. సఫారీ గడ్డపై మూడు సార్లు, వెస్టిండీస్ గడ్డపై 2 సార్లు, ఇంగ్లండ్ గడ్డపై 2 సార్లు, భారత గడ్డపై రెండు సార్లు.. ఆసీస్ గడ్డపై 2 సార్లు బుమ్రా ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.
స్పిన్‌కు అనుకూలంగా ఉండే భారత పిచ్‌పై చెలరేగిన బుమ్రా ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. విశాఖ టెస్టులో బుమ్రా ఇన్‌స్వింగర్, ఔట్‌స్వింగర్స్‌తో పాటు బుల్టెట్ యార్కర్లతో ప్రత్యర్థిని ముప్పు తిప్పలు పెట్టాడు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులు సంధిస్తూ బౌలింగ్‌లో వేరియేషన్స్ చూపించడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు అయోమయానికి గురయ్యారు. ఇక స్టోక్స్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన విధానం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.