సిరాజ్ కు అవి అవసరమా ? ప్రభుత్వానికి పలువురి ప్రశ్నలు

  • Written By:
  • Publish Date - August 10, 2024 / 08:31 PM IST

ఒలింపిక్స్ లో మెడల్స్ రాలేదు.. మనమింతే… మనకింతేనా… ఇదీ ప్రస్తుతం జరుగుతున్న చర్చ… అయితే ఇక్కడ వ్యవస్థలో కూడా లోపాలున్నాయన్నది స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కు ప్రభుత్వం ఇచ్చిన నజరానానే తీసుకోండి…డబ్బులు ఎక్కువగా వస్తున్న క్రికెటర్లకు ఇలాంటి నజరానాలు ఎందుకన్నది ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. ప్రస్తుతం క్రీడావర్గాల్లో దీనిపైనే చర్చ జరుగుతోంది. టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగంతో పాటు నగరంలో అత్యంత ఖరీదైన ప్రదేశంలో 600 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆటో డ్రైవర్ కొడుకుగా క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించిన సిరాజ్.. అసాధారణ ప్రదర్శనతో అంచెలంచెలుగా ఎదిగాడు. టీమిండియాలో కీలక పేసర్‌గా మారాడు.

జాతీయ జట్టులో చోటు దక్కించుకుని బీసీసీఐ కాంట్రాక్ట్ పొందిన ఏ క్రికెటర్ కైనా బాగానే డబ్బులు వస్తాయి. ముఖ్యంగా ఐపీఎల్ వచ్చిన తర్వాత చాలామంది యువ ఆటగాళ్ళు కోటీశ్వరులయ్యారు. ఈ క్రమంలో సిరాజ్ కూడా ఆర్థికంగా కూడా చాలా బలపడ్డాడు. ఐపీఎల్‌లో ఒక్క సీజన్ కు 7 కోట్ల వేతనం అందుకుంటున్న సిరాజ్.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ల్లో ఏ గ్రేడ్‌లో ఉన్నాడు. ఏ గ్రేడ్ ఆటగాళ్లకు 5 కోట్ల వార్షిక వేతనం లభిస్తోంది. మ్యాచ్ ఫీజులు, అలవెన్సులు ప్రత్యేకం. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్‌ల ద్వారా లభించే నగదు బహుమతులు ఇంకా అదనం. అలాగే వాణిజ్య ప్రకటనల ఒప్పందాల ద్వారా కూడా ఆర్జిస్తున్నాడు. బిజినెస్ వెబ్‌సైట్స్ అంచనాల ప్రకారం మహమ్మద్ సిరాజ్ నెట్‌వర్త్ దాదాపు 74 కోట్లు.

అలాంటి సిరాజ్ కు ప్రభుత్వ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఏడాదికి 20 కోట్లు వరకు సంపాదించే మహమ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం 600 చదరపు గజాల ఇంటి స్థలం ఇవ్వడం ఎందుకని క్రీడాభిమానులు ప్రశ్నిస్తున్నారు. అసలు క్రికెటర్లకు ప్రభుత్వాలు ఏం చేయాల్సిన అవసరం లేదని, వారే ఆర్థికంగా బలపడగలరని ఇటీవల హైదరాబాద్ మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కూడా వ్యాఖ్యానించాడు. తనకు స్థలం ఇవ్వాలన్న ప్రతిపాదనను కూడా రాయుడు తిరస్కరించాడు. సిరాజ్ కూడా ఇలాగే తిరస్కరించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే ప్రభుత్వాలు కూడా ఛాంపియన్లుగా ఎదిగిన తర్వాత నజరానాలు ప్రకటించే బదులు.. వారి కష్టాల్లో భాగమవ్వాలని సూచిస్తున్నారు. క్రీడలపై తెలంగాణ ప్రభుత్వానికి చిత్తు శుద్ది ఉంటే.. హాకీ ఇండియాను స్పాన్సర్‌ చేస్తున్న ఒడిశా ప్రభుత్వం తరహాలో ఏదైనా ఇతర క్రీడను ఎంకరేజ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ఒలింపిక్స్ క్రీడల్లో రాణిస్తున్న ప్రతిభావంతమైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడానికి కృషి చేయాలంటున్నారు.