టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం కశ్మీర్ పర్యటనలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ తాజాగా షేర్ చేసిన వీడియో అభిమానుల హృదయాలను తాకింది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన అమిర్ హుసేన్ లోనీ అనే దివ్యాంగ క్రికెటర్ పేరు అప్పట్లో సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. దురదృష్టవశాత్తూ ఎనిమిదేళ్ల వయసులో ఓ ప్రమాదంలో రెండు చేతులను పోగొట్టుకున్నాడు. అయినప్పటికీ అడుగడుగునా ఎదురవుతున్న సవాళ్లను దాటుకుంటూ.. రాష్ట్ర పారా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎదిగాడు. రెండు చేతులు లేకున్నా తన మెడ భాగం, భుజం మధ్య బ్యాట్ పెట్టకుని క్రికెట్ ఆడే అమిర్.. కాళ్లతో బౌలింగ్ చేయగలడు.
అమిర్ హుసేన్ గురించి తెలుసుకున్న క్రికెట్ దిగ్గజం సచిన్ ఆట పట్ల అతడి అంకిత భావానికి ఫిదా అయ్యాడు. అమిర్‌ను కలిసే అవకాశం వస్తే.. అతడి పేరుతో ఉన్న జెర్సీని అడిగి మరీ బహుమతిగా అందుకుంటానని సచిన్ పేర్కొన్నాడు. తాజాగా తన పర్యటనలో భాగంగా సచిన్ అమిర్ హుసేన్‌ను కలిశాడు . తన సంతకంతో కూడిన బ్యాట్‌ను అతడికి గిఫ్టుగా ఇచ్చాడు. అంతేకాదు.. అమిర్ ఎలా బ్యాటింగ్ చేస్తాడో అడిగి మరీ మెళకువలు నేర్చుకున్నాడు.
అమిర్ హుసేన్‌తో పాటు అతడిని ఆప్యాయంగా అక్కున చేర్చుకున్న సచిన్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.