ఆగస్టు 15న భారత దేశం అంతా స్వతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. కానీ భారత క్రికెట్ అభిమానులు మాత్రం ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే భారత క్రికెట్‌లో ఎన్నో మార్పులు తీసుకొచ్చి, 2011 వరల్డ్ కప్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించిన కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ ఇదే రోజుని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో న్యూజిల్యాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఆ బాధ నుంచి క్రికెట్ అభిమానులు నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కరోనా మహమ్మారి ప్రపంచంపై పంజా విసిరింది. దీంతో క్రికెట్ కార్యక్రమాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. తమ అభిమాన స్టార్లను మైదానంలో చూడటం కుదరక ఫ్యాన్స్ తెగ ఇబ్బంది పడ్డారు.
ప్రపంచంలో పలు దేశాల్లో పెట్టినట్లే భారత్‌లో కూడా లాక్‌డౌన్ పెట్టేశారు. ఇలాంటి సమయంలో 2020 స్వతంత్ర దినోత్సవం నాడు టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అప్పటికే అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ వదిలేసిన అతను.. పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ధోనీతోపాటు టీమిండియా వెటరన్ బ్యాటర్ సురేష్ రైనా కూడా అదే రోజున అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. వీళ్లిద్దరూ ఇలా టీం నుంచి తప్పుకోవడంతో భారత క్రికెట్ ఫ్యాన్స్ అంతా షాకయ్యారు. ముఖ్యంగా కెప్టెన్‌గా ధోనీ వ్యూహాలు మరెవరికీ సాధ్యం కాలేదనే చెప్పాలి. ఇప్పటికీ టీమిండియాకు సరైన లీడర్ లేడని కొందరు నిపుణులు కూడా ఒప్పుకుంటున్నారంటే.. ధోనీ ఎంత విలువైన నాయకుడో చెప్పొచ్చు.