ప్రపంచకప్‌లో హై ఓల్టేజ్ మ్యాచ్ అక్టోబర్ 14న జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఊపిరి బిగపట్టి మరీ చూసే భారత్-పాక్ మ్యాచ్ ఆ రోజున జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానమైన గుజరాత్ అహ్మాదాబాద్‌లోని నరేంద్రమోదీ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ జరిగే నరేంద్ర మోదీ స్టేడియంపై బాంబు దాడి, రసాయన దాడులు చేస్తామన్న బెదిరింపులతో పోలీసులు కనివినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. చీమ చిటుక్కుమన్నా తెలిసేలా… అహ్మదాబాద్‌పై డేగ కన్ను వేస్తున్నారు. వేలమంది భద్రతా సిబ్బందితో ఇప్పటికే అహ్మదాబాద్‌ను జల్లెడ పడుతున్నారు.
బాంబు దాడులు, రసాయన దాడులు చేస్తామంటూ వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు అహ్మదాబాద్ పోలీసులు తెలిపారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు NSG బ్లాక్ క్యాట్ కమెండోలను మోహరిస్తున్నట్లు అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జి ఎస్ మాలిక్ తెలిపారు. NSG తో పాటు 7 వేల మంది పోలీసులను మోహరిస్తున్నట్లు వెల్లడించారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా దృష్టి ఉంటుందని.. అందుకే దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేశామని మాలిక్ వివరించారు. మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్‌లో సున్నితమైన ప్రాంతాల్లో శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు 4 వేలమంది హోంగార్డులను మోహరించినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు. 20 ఏళ్లలో అహ్మదాబాద్‌లో క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా మతపరమైన హింస ఎప్పుడూ జరగలేదని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జి ఎస్ మాలిక్ గుర్తు చేశారు.