భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది వన్డేల్లో అరుదైన రికార్డును సృష్టించింది. ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా కొత్త చరిత్ర లిఖించింది. 2023 క్యాలెండర్ ఇయర్‌లో టీమిండియా వన్డేల్లో 27 విజయాలు సాధించింది. ఓవరాల్‌గా వన్డేల చరిత్రలో ఒకే ఏడాదిలో అత్యధిక విజయాలు సాధించిన రెండో టీమ్‌గా భారత్ నిలిచింది. 2003లో ఆస్ట్రేలియా వన్డేల్లో అత్యధికంగా 30 విజయాలు సాధించి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మూడో స్థానంలో కూడా ఆస్ట్రేలియానే ఉంది. 1993లో వన్డేల్లో 26 విజయాలను ఆస్ట్రేలియా తమ ఖాతాలో వేసుకుంది. నాలుగు, ఐదో స్థానాల్లో దక్షిణాఫ్రికా ఉంది.
ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచింది. కానీ కీలకమైన ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలై రన్నరప్ తో సరిపెట్టుకుంది. అంతకుముందు స్వదేశంలోనే ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను కూడా రెండూ ఒకటి తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా. ఇప్పుడు దక్షిణాఫ్రికా గడ్డపై దక్షిణాఫ్రికాను ఓడించి వన్డే సిరీస్ సాధించింది. ఇక, భారత్ తరపున ఓపెనర్ శుభ్ మాన్ గిల్ సృష్టిచిన సునామి అంత ఇంత కాదు. స్టార్ ఓపెనర్ శుభమన్ గిల్ ఈ ఏడాది మొత్తం 29 వన్డే మ్యాచ్‌లు ఆడి 63.36 సగటుతో 1584 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2023లో గిల్ అత్యధిక స్కోరు 208 పరుగులు. ఈ ఏడాది గిల్ ఒక్కసారి మాత్రమే డకౌట్ అయ్యాడు.