దుమ్మురేపిన స్మృతి,రేణుక తొలి వన్డేలో విండీస్ చిత్తు

సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు దుమ్మురేపుతోంది. వెస్టిండీస్ పై టీ ట్వంటీ సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్ తాజాగా వన్డే సిరీస్ లోనూ శుభారంభం చేసింది. బ్యాటింగ్ లో స్మృతి మంధాన మెరుపులు, బౌలింగ్ లో రేణుకా సింగ్ అదిరిపోయే స్పెల్ తో భారత మహిళల జట్టు 211 రన్స్ తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.

  • Written By:
  • Publish Date - December 23, 2024 / 06:58 PM IST

సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు దుమ్మురేపుతోంది. వెస్టిండీస్ పై టీ ట్వంటీ సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్ తాజాగా వన్డే సిరీస్ లోనూ శుభారంభం చేసింది. బ్యాటింగ్ లో స్మృతి మంధాన మెరుపులు, బౌలింగ్ లో రేణుకా సింగ్ అదిరిపోయే స్పెల్ తో భారత మహిళల జట్టు 211 రన్స్ తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో స్మృతి మంధాన బ్యాటింగ్ హైలెట్ గా నిలిచింది. సూపర్ ఫామ్ లో ఉన్న మంధాన తృటిలో సెంచరీ చేజార్చుకుంది. ఆమె 102 బంతుల్లో 13 ఫోర్లతో 91 పరుగులు చేయగా..ప్రతీక రావల్‌ 40, హర్లీన్‌ డియోల్‌ 44, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 34, రిచా ఘోష్‌ 26, జెమీమా రోడ్రిగెజ్‌ 31 రాణించారు. ఇన్నింగ్స్‌ చివర్లో భారత టెయిలెండర్లు భారీ షాట్లు ఆడలేకపోవడంతో మరింత భారీస్కోర్ చేసే అవకాశం చేజారింది.

ఛేజింగ్ లో విండీస్ తొలి ఓవర్ నుంచే చేతులెత్తేసింది. భారత పేసర్ రేణుకా సింగ్ ధాటికి ఆ జట్టు బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. విండీస్ కేవలం 52 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. క్యాంప్ బెల్ , ఫ్లెచర్ కాస్త పోరాడడంతో కరేబియన్ టీమ్ స్కోర్ 100 దాటగలిగింది. చివరికి విండీస్ 26.2 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. రేణుకా సింగ్‌10 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టింది. ఆమె కెరీర్ లో ఇదే తొలి ఐదు వికెట్ల ఘనత. భారత్‌ బౌలర్లలో రేణుకా సింగ్‌తో పాటు టైటాస్‌ సాధు, ప్రియా మిశ్రా, దీప్తి శర్మ కూడా రాణించారు. రేణుకా సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్ లో రెండో మ్యాచ్ మంగళవారం వడోదరాలోనే జరుగుతుంది.