T20, World Cup : సుధీర్ఘ నిరీక్షణకు తెర… టీ ట్వంటీ వరల్డ్ కప్ విజేత భారత్

భారత క్రికెట్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. వన్డే ప్రపంచకప్ ఓటమి బాధను చెరిపేస్తూ టీమిండియా టీ ట్వంటీల్లో విశ్వవిజేతగా నిలిచింది.

భారత క్రికెట్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. వన్డే ప్రపంచకప్ ఓటమి బాధను చెరిపేస్తూ టీమిండియా టీ ట్వంటీల్లో విశ్వవిజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో రోహిత్ సేన 7 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మెగా టోర్నీ ఆరంభం నుంచీ పేలవ ఫామ్ తో నిరాశపరిచిన కోహ్లీ అక్షర్ పటేల్ తో కలిసి కీలక పార్టనర్ షిప్ నెలకొల్పాడు. నాలుగో వికెట్ కు 72 పరుగులు జోడించాడు.

అక్షర్ పటేల్ 47 రన్స్ కు ఔటవగా… కోహ్లీ 76 పరుగులు చేశాడు. చివర్లో శివమ్ దూబే ధాటిగా ఆడడంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. 177 పరుగుల లక్ష్యఛేదనలో సౌతాఫ్రికా ఆరంభంలోనే 2 వికెట్లు చేజార్చుకుంది. హెండ్రిక్స్ 4 , మాక్ర్ రమ్ 4 పరుగులకే ఔటయ్యారు. ఈ దశలో క్వింటన్ డికాక్ , స్టబ్స్ కీలక పార్టనర్ షిప్ నెలకొల్పారు. వీరిద్దరూ ఔటైన తర్వాత క్లాసెన్, మిల్లర్ మెరుపు బ్యాటింగ్ తో మ్యాచ్ ను భారత్ నుంచి లాగేసే ప్రయత్నం చేశారు. ఐపీఎల్ నుంచీ సూపర్ ఫామ్ లో ఉన్న క్లాసెన్ కేవలం 27 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. అయితే క్లాసెన్ ను పాండ్యా ఔట్ చేయడం మ్యాచ్ టర్నింగ్ పాయింట్ గా చెప్పొచ్చు. అప్పటికీ సౌతాఫ్రికా విజయం కోసం 23 బంతుల్లో 26 పరుగులే చేయాల్సి ఉంది.

ఇక్కడ నుంచి భారత బౌలర్లు అద్భుతమే చేశారు. ముఖ్యంగా స్టార్ పేసర్ బూమ్రా డాట్ బాల్స్ వేయడంతో పాటు వికెట్ తీశాడు. అటు హార్థిక్ పాండ్యా , అర్షదీప్ సింగ్ కూడా సఫారీలను కట్టడి చేశారు. క్రీజులో మిల్లర్ ఉన్నప్పటకీ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మిల్లర్ తో పాటు రబాడను ఔట్ చేసి 8 పరుగులే ఇచ్చాడు. దీంతో 11 ఏళ్ళ తర్వాత భారత్ ఐసీసీ ట్రోఫీ అందుకుంది. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ లో ఓటమి బాధను అభిమానులకు దూరం చేస్తూ టీ ట్వంటీ వరల్డ్ కప్ ను గెలుచుకుంది.