ఇక ఐపీఎల్ లో దంచి కొట్టి విండీస్ పర్యటనకు ఎంపికైన యశస్వి జైస్వాల్.. టెస్టు సిరీస్ లో రాణించాడు. తొలి టెస్టులో శతకం బాదడంతో పాటు రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో అర్ధ శతకంతో మెరిశాడు. అయితే అతడికి తొలి వన్డేలో ఛాన్స్ దొరికేది కష్టమై. శుబ్ మన్ గిల్, రోహిత్ శర్మలు ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో హ్యాట్రిక్ గోల్డెన్ డక్స్ గా వెనుదిరిగిన నెంబర్ 1 టి20 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కు ఈ సిరీస్ అగ్ని పరీక్ష లాంటిది. ఇందులో విఫలం అయితే అతడి వన్డే కెరీర్ దాదాపు ముగిసినట్లే.
ఆల్ రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా బరిలోకి దిగనున్నారు. ఐపీఎల్ తర్వాత హార్దిక్ పాండ్యా ఆడుతున్న తొలి సిరీస్ ఇదే కావడం విశేషం. ఇక స్పిన్నర్లుగా కుల్చా ద్వయం బరిలోకి దిగే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్ లు తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. జడేజా రూపంలో మూడో స్పిన్నర్ ఉంటాడు. ఇక పేసర్లుగా ముకేశ్ కుమార్, సిరాజ్ లు బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉంది. ముఖాముఖి పోరులో టీమిండియాదే హవా. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 139 మ్యాచ్ లు జరగ్గా.. అందులో భారత్ 70 మ్యాచ్ ల్లో నెగ్గింది. వెస్టిండీస్ 63 మ్యాచ్ ల్లో నెగ్గింది. మరో నాలుగు మ్యాచ్ ల్లో ఫలితం తేలలేదు. రెండు మ్యాచ్ లు టైగా ముగిశాయి.